
కర్ణాటక : డబ్బుల కోసం ఆశపడి ఎవరో అన్నమాటలను పట్టుకొని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల పేరుకు మాయని మచ్చ తెచ్చేలా తన మాజీ భర్త ప్రవర్తించాడని ఫిర్యాదిదారు, ముసుగుమనిషి ఒకప్పటి భార్య ఆరోపించింది. అతనితో విడాకులు తీసుకున్న మండ్య జిల్లా నాగమంగళకు చెందిన మహిళ తన మాజీ భర్త గురించి మీడియాతో మాట్లాడారు. అతనిది కూడా మండ్య జిల్లానే. 25 ఏళ్ల కిందట మేం పెళ్ళి చేసుకున్నాం, అతడు నేత్రావతి స్నానాల ఘాట్లను శుభ్రం చేసే పనిలో ఉండేవాడు. 7 సంవత్సరాలపాటు కలిసి ఉన్నాం, మాకు ఒక మగ, ఒక ఆడ పిల్ల ఉన్నారు, కుమార్తెకు పెళ్లయింది. నా మాజీ భర్త నా మీద నిత్యం అనుమానంతో గొడవపడేవాడు, అతని బాధలు పడలేక విడాకులు తీసుకున్నా. అతడు ధర్మస్థల గురించి చెప్పేవన్నీ అబద్ధాలే అని మండిపడింది.
ఆ మాటలే వినలేదు
ధర్మస్థలలో అత్యాచారాలు జరిగేవని, నది పక్కన శవాలు పాతిపెట్టారని, నగలు దోచుకునేవారని నేను ఎప్పుడూ వినలేదు. నాతో భర్త ఎప్పుడూ అలా చెప్పలేదు. జరిగే ప్రచారమంతా అబద్ధం అని ఆమె పేర్కొంది. ఆ పుణ్యక్షేత్రం మీద ఏదో చేయడానికి కుట్రతో ఇలా ప్రచారం చేస్తున్నారని తెలిపింది. తాము విడిపోయిన తరువాత అతడు మరొకరిని పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. భరణం కోసం కోర్టుకు వెళ్తే, నాకు జీతమే రాదు, భోజనం మాత్రమే పెడతారు, ఏమీ ఇవ్వలేను అని కోర్టులో చెప్పాడన్నారు. పుట్టింటిలో తల్లి, పిల్లలతో కలిసి ఉంటున్నట్లు తెలిపింది.