
రాష్ట్రంలో పెరిగిన కుక్క కాటు కేసులు
రారా కృష్ణయ్యా
శ్రీకృష్ణజన్మాష్టమి సమీపిస్తుండటంతో వెన్నదొంగ నల్లనయ్య విగ్రహాలు మార్కెట్‌లో కొలువు దీరాయి. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న విగ్రహాలను బెంగళూరులోని మల్లేశ్వరంలో విక్రయానికి సిద్ధం చేసిన దృశ్యం
● కుక్కకాటుకు ఈ ఏడాది 26 మంది బలి
శివాజీనగర: ఢిల్లీలో వీధి కుక్కల బెడదకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రాష్ట్రంలో ఆరోగ్యశాఖ రూపొందించిన నివేదికలోని అంశాలు ఆందోళనకు గురి చేశాయి. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 2.81 లక్షల కుక్క కాటు కేసులు నమోదు కాగా, ఇది గత సంవత్సరం కంటే 37 శాతం అధికమని నివేదిక వెలుగు చూసింది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 26 మంది మృతి చెందినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం 2024లో 3.6 లక్షల కుక్క కాటు కేసులు నమోదు కాగా పిచ్చి కుక్క కాటుతో 42 మంది మరణించారు.
విజయపుర జిల్లాకు అగ్రస్థానం
కుక్క కాటు కేసులకు సంబంధించి విజయపుర జిల్లా 15,527 కుక్క కాటు కేసులతో అగ్రస్థానంలో ఉంది. బెంగళూరు 13,821 కేసులతో రెండో స్థానం, హాసన (13,388), దక్షిణ కన్నడ (12,524) బాగలకోట (12,392) ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి. ధారవాడ, బెళగావి, ఉత్తర కన్నడ, గదగ్ జిల్లాల్లో 7 వేల కుక్క కాటు కేసులు నమోదయ్యాయి.
గుంపుగా వచ్చి రక్కేశాయి
మండ్య : మండ్య జిల్లా శ్రీరంగపట్టణలో వీధి శునకాలు స్వైర విహారం చేశాయి. ఒలెకుయ్యో వీధిలో నివాసం ఉంటున్న మంజునాథ్ కుమార్తె భవ్య(7), శివు కుమార్తె కీర్తన(8)లు మంగళవారం ఆడుకుంటుండగా గుంపుగా వచ్చిన శునకాలు దాడి చేశాయి. తప్పించుకునేందుకు వీలు లేకుండా చుట్టుముట్టి కడుపు, తల, ముఖం, కళ్లపై ఇష్టానుసారంగా కరిచాయి. చిన్నారులు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కుక్కలను తరిమేశారు. గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించారు.

రాష్ట్రంలో పెరిగిన కుక్క కాటు కేసులు