
ఏనుగుతో సెల్ఫీనా.. రూ.25 వేల జరిమానా కట్టు
మైసూరు : ఏనుగునుకు సమీపంలో నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించి గజరాజు దాడిలో గాయపడిన బసవరాజు వ్యక్తికి అటవీ శాఖ అధికారులు రూ.25వేల జరిమానా విధించడంతోపాటు వన్యప్రాణులకు ఇకపై ఇబ్బందులు కలిగించనని హామీ పత్రం రాయించుకున్నారు. చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకా బండీపుర అరణ్యం నుంచి ఆహారం కోసం రోడ్డుపైకి వచ్చిన ఏనుగు ఓ వాహనంలోని బస్తా నుంచి క్యారెట్ లాక్కుంటుండగా కారులో వచ్చిన బసవరాజు కిందకు దిగి సెల్ఫీ తీసుకుంటుండగా ఏనుగు అతన్ని తరిమివేసి స్వల్పంగా గాయపరిచిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు బసవరాజు అడ్రస్ తెలుసుకొని అతని ఇంటికి వెళ్లి హెచ్చరికలు జారీ చేసి జరిమానా విధించారు.
మెట్రో పట్టాలపైకి దూకి
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
దొడ్డబళ్లాపురం: ఓ వ్యక్తి మెట్రో రైలు పట్టాలపైకి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మెజెస్టిక్ మెట్రో రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. 35 ఏళ్ల వయసున్న వ్యక్తి గ్రీన్ లైన్ మెట్రో ప్లాట్‌ఫార –1లో మెట్రో ట్రైన్ వస్తున్న సమయంలో పట్టాలపై దూకాడు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిని తక్షణం ఆస్పత్రికి తరలించారు. తరచూ ఇలాంటి సంఘటనలు మెట్రో స్టేషన్‌లలో చోటుచేసుకుంటుండంతో బీఎంఆర్‌సీఎల్ భద్రత కట్టుదిట్టం చేయాలని ప్రయాణీకులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
గున్న ఏనుగులకు నామకరణం
శివమొగ్గ : శివమొగ్గ తాలుకాలోని సక్రైబెలులో ఉన్న బిడారలోని ఏనుగుల శిబిరంలో మంగళవారం ఏనుగుల దినోత్సవాన్ని అటవీశాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు. శిబిరంలోని 23 ఏనుగులను మావటిలు, కాపలాదారులు అందంగా సింగారించి వేడుకలు నిర్వహించారు. ఇటీవల జన్మించిన రెండు ఆడ గున్న ఏనుగులకు నామకరణం చేశారు. ఒకదానికి చాముండి అని, మరో గున్న ఏనుగుకు తుంగ అని నామకరణం చేశారు.
ఎన్‌ఈపీ అమలుపై
పిల్ తిరస్కృతి
బనశంకరి: జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వేసిన పీఐఎల్(పిల్)ను హైకోర్టు తిరస్కరించింది. మంగళవారం జాతీయ విద్యా విధానం పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఎన్‌ఈపీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం సాధ్యం కాదని తెలుపుతూ ఆ పిల్‌ను తిరస్కరించింది.

ఏనుగుతో సెల్ఫీనా.. రూ.25 వేల జరిమానా కట్టు

ఏనుగుతో సెల్ఫీనా.. రూ.25 వేల జరిమానా కట్టు