మంత్రి రాజణ్ణ తొలగింపుపై దుమారం | - | Sakshi
Sakshi News home page

మంత్రి రాజణ్ణ తొలగింపుపై దుమారం

Aug 13 2025 5:26 AM | Updated on Aug 13 2025 5:26 AM

మంత్ర

మంత్రి రాజణ్ణ తొలగింపుపై దుమారం

బనశంకరి: సహకార శాఖ మంత్రి కేఎన్‌.రాజణ్ణను కేబినెట్‌ నుంచి తొలగించిన విషయంపై అసెంబ్లీలో ఉభయసభలు దద్దరిల్లాయి. రాజణ్ణను మంత్రి పదవి నుంచి తొలగించడానికి కారణం ఏమిటి? దీనిపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య సభకు సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు శాసనసభలో పట్టుబట్టాయి. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత ప్రభుత్వం సమాధానమిస్తుందని మంత్రి హెచ్‌కే.పాటిల్‌ హామీ ఇచ్చి ప్రతిపక్ష సభ్యులను సమాధానపరిచారు. మరో పక్క శాసన మండలిలో మంత్రి కేఎన్‌.రాజణ్ణ రాజీనామా అంశంపై అధికార, విపక్షాల మధ్య గందరగోళం, వాగ్వాదం చేసుకోవడంతో కొద్దిసేపు సభాపతి సభను వాయిదా వేశారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే విపక్షనేత ఆర్‌.అశోక్‌ మంత్రి రాజణ్ణను మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించారు? దీనిపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య సభకు సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సోమవారం మధ్యాహ్నం సభలో మేం ఈ విషయం ప్రస్తావించగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే.పాటిల్‌ మీడియాలో వచ్చిన విషయాన్ని చర్చించడం సాధ్యం కాదని తెలిపారు. సోమవారం గవర్నర్‌ కేఎన్‌.రాజణ్ణను మంత్రివర్గం నుంచి తొలగించిన ఆదేశాలపై సంతకం చేశారు. దీంతో సభకు దీనిపై తెలుసుకునే హక్కు ఉందని ఆర్‌.అశోక్‌ ప్రతిపాదించారు.

సభకు తెలపడం సర్కారు కర్తవ్యం

శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో మంత్రిని తొలగించడంపై సభకు తెలియజేయడం ప్రభుత్వ కర్తవ్యం. మంత్రిని తొలగించిన విషయం మీడియా ద్వారా తెలుసుకోవాలా? ప్రభుత్వానికి బాధ్యత లేదా? మమ్మల్ని చీకట్లోకి నెట్టేశారు, తక్షణం సమాధానం ఇవ్వాలన్నారు. మంత్రి రాజణ్ణను ఏ కారణానికి మంత్రివర్గం నుంచి తొలగించారు? అనే దానిపై ప్రభుత్వం కారణం తెలియజేయాలని అశోక్‌ డిమాండ్‌ చేశారు. ఈ దశలో అధికార, విపక్ష సభ్యుల మధ్య పరస్పరం వాగ్వాదం చోటు చేసుకోవడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ సమయంలో స్పీకర్‌ యూటీ.ఖాదర్‌ మాట్లాడుతూ అంతర్గత విషయాన్ని చర్చించరాదని తెలపడంతో విపక్ష సభ్యులు సురేశ్‌కుమార్‌, సునీల్‌కుమార్‌తో పాటు పలువురు సభ్యులు లేచి నిలబడి స్పీకర్‌ వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని పట్టుబట్టడంతో సభలో మరింత గందరగోళం తలెత్తింది. గందరగోళం మధ్య తన ప్రసంగాన్ని కొనసాగించిన విపక్షనేత ఆర్‌.అశోక్‌ మంత్రి రాజణ్ణను మంత్రివర్గం నుంచి తొలగించిన విషయంపై ప్రభుత్వం సోమవారం తెలపాలి కానీ మౌనంగా ఉందని సమాధానం ఇవ్వాలని, ఏ కారణానికి రాజణ్ణను తొలగించారు? నిజం చెప్పినందుకు ఆయనను బలిపశువును చేశారా? అని ప్రశ్నించారు.

అది అంతర్గత విషయం కాదు

దీనికి మద్దతునిచ్చిన బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై.విజయేంద్ర రాహుల్‌గాందీ బెంగళూరుకు వచ్చి ఓట్ల చోరీకి పాల్పడ్డారని ధర్నా చేపట్టారు. రాజణ్ణను తొలగించిన విషయం అంతరిక విషయం పరిధిలోకి రాదని, ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. విపక్ష సభ్యులు తమ స్థానాల్లో నుంచి లేచి నిలబడి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా కొనసాగించడాన్ని గమనించిన స్పీకర్‌ ప్రభుత్వ పరంగా సమాధానం ఇవ్వాలని మంత్రి హెచ్‌కే.పాటిల్‌కు సూచించారు. స్పీకర్‌ సూచనతో లేచి నిలబడి మాట్లాడిన మంత్రి హెచ్‌కే.పాటిల్‌ ముందు ప్రశ్నోత్తరాల సమయం జరగాలని, అనంతరం మంత్రి రాజణ్ణను మంత్రివర్గం నుంచి తొలగించిన విషయంపై ప్రభుత్వం సమాధానమిస్తుందని తెలిపి విపక్ష సభ్యులను శాంతపరిచే ప్రయత్నం చేశారు. మంత్రి సమాధానం అనంతరం విపక్ష సభ్యులు ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సమాధానం ఇవ్వాలని తెలిపిన అనంతరం సభ కాస్త సద్దుమణగడంతో స్పీకర్‌ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు. శాసన మండలి విపక్ష నేత చలవాది నారాయణస్వామి మాట్లాడుతూ మంత్రి కేఎన్‌.రాజణ్ణను మంత్రి పదవి నుంచి తొలగించడం గురించి రాష్ట్ర గవర్నర్‌ ప్రత్యేక కార్యదర్శి సంతకం చేసిన లేఖ చదవడానికి ప్రయత్నించారు.

అధికార పార్టీ విప్‌ అభ్యంతరం

దీనికి అధికార పార్టీ విప్‌ సలీం అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం పూర్తయిన అనంతరం మాట్లాడాలని సభాపతి సూచించారు. ఇది అత్యవసర విషయమని రాజణ్ణను మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించారు? అని చలవాది ప్రశ్నించారు. దీనికి బీజేపీ సభ్యులైన సీటీ.రవి, రవికుమార్‌తో పాటు పలువురు మద్దతు పలికారు. విపక్షసభ్యులు వ్యాఖ్యలను వ్యతిరేకించిన అధికార పార్టీ సభ్యుడు రాజణ్ణపై ఎప్పటి నుంచి ప్రేమ పుట్టిందని వ్యంగ్యమాడారు. సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని సభలో గందరగోళం తలెత్తడంతో సభాపతి సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభం కాగానే రాజణ్ణను తొలగించిన విషయం మీడియాలో వచ్చిందని, తొలగించడానికి కారణం ఏమిటి, అవినీతిలో నిమగ్నమయ్యారా? అని విపక్ష నేత చలవాది నారాయణస్వామి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి లేదా సభాపక్ష నేత సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. సభాపక్ష నేత సభకు రాలేదని, సభకు హాజరైన అనంతరం ఆయనతో సమాధానం ఇప్పిస్తామని సభాపతి హామీ ఇవ్వడంతో విపక్ష నేతలు సంతృప్తి చెందగా సభాపతి ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు.

రాజణ్ణ మద్దతుదారుల నిరసన

తుమకూరు : కే.ఎన్‌.రాజణ్ణను మంత్రి పదవి నుంచి తొలగించడంతో అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు మంగళవారం మధుగిరిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని దుకాణాలను బంద్‌ చేయించారు. సీఎం, డీసీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మద్దతుదారులు మాట్లాడుతూ రాజణ్ణను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

అసెంబ్లీలో దద్దరిల్లిన ఉభయ సభలు

సభకు జవాబివ్వాలని విపక్షాల పట్టు

సభకు ఆలస్యంగా వచ్చిన

సీఎం

మంత్రి రాజణ్ణను మంత్రివర్గం నుంచి తొలగించడంపై ప్రభుత్వం సభలో సమాధానం ఇవ్వాలని, తొలగింపునకు కారణం తెలపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసిన సమయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య సభలో లేరు. మంగళవారం ఉదయం విధానసౌధ కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య విధానసౌధ మూడో అంతస్తులో గత తన కార్యాలయంలో ఉండి సభకు కాస్త ఆలస్యంగా హాజరయ్యారు. మంత్రి రాజణ్ణ తొలగింపు చర్చ సమయంలో ముఖ్యమంత్రి హాజరు కాలేదు.

మంత్రి రాజణ్ణ తొలగింపుపై దుమారం 1
1/3

మంత్రి రాజణ్ణ తొలగింపుపై దుమారం

మంత్రి రాజణ్ణ తొలగింపుపై దుమారం 2
2/3

మంత్రి రాజణ్ణ తొలగింపుపై దుమారం

మంత్రి రాజణ్ణ తొలగింపుపై దుమారం 3
3/3

మంత్రి రాజణ్ణ తొలగింపుపై దుమారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement