
న్యూఢిల్లీ: కన్నడ స్టార్ నటుడు దర్శన్ తూగుదీపకు భారీ షాక్ తగిలింది. కర్ణాటక హైకోర్టు ఆయనకు జారీ చేసిన బెయిల్‌ను సుప్రీం కోర్టు గురువారం రద్దు చేసింది. తక్షణమే ఆయన్ని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. తన అభిమాని అయిన రేణుకాస్వామిని హత్య కేసులో అరెస్టైన దర్శన్.. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న సంగతి తెలిసిందే.
‘‘మేము బెయిల్ మంజూరు, రద్దు ఈ రెండు అంశాలను పరిశీలించాం. హైకోర్టు ఉత్తర్వు యాంత్రికంగా అధికారాన్ని వినియోగించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బెయిల్ మంజూరు చేయడం విచారణపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు’’ అని బెయిల్ రద్దు చేస్తూ తీర్పు సందర్భంగా జస్టిస్ మహదేవన్ వ్యాఖ్యానించారు.
ఈ తీర్పుపై బెంచ్‌లోని మరో న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలా హర్షం వ్యక్తం చేశారు. ‘‘జే మహదేవన్ వర్ణించలేనంత గొప్ప తీర్పును ప్రకటించారు. నిందితులు ఎంతటి వాళ్లైనా.. చట్టానికి అతీతులేం కాదు అనే ఓ స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది’’ అని జస్టిస్ జేబీ పార్దీవాలా అన్నారు. ప్రస్తుతం దర్శన్ తమిళనాడులో ఉన్నట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఉత్తర్వుల కాపీని ట్రయల్ కోర్టుకు అందించి.. ఆపై వారెంట్ ద్వారా దర్శన్‌ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తీర్పు సందర్భంగా ద్శిసభ్య ధర్మాసనం.. ‘‘బెయిల్ మంజూరు చేయడానికి చట్టపరమైన కారణం లేదు. దర్శన్‌కు బెయిల్ ద్వారా లభించిన స్వేచ్చ.. న్యాయ వ్యవస్థను దెబ్బతీయే ప్రమాదంలోని నెట్టింది’’ అని అభిప్రాయపడింది. ఈ క్రమంలో.. గతంలో జైలులో దర్శన్‌కు ప్రత్యేక వసతులు అందిన విషయాన్ని జస్టిస్ పార్దీవాలా ప్రస్తావించారు.
‘‘జైల్‌లో నిందితుడికి ఫైవ్‌స్టార్ హోటల్ ట్రీట్‌మెంట్ అందిన విషయం మా దృష్టికి వచ్చింది. జైలు ప్రాంగణంలోనే నిందితుడు సిగరెట్లు, మందు తాగిన విషయం మాకు తెలిసింది. ఈ వ్యవహారంలో జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవు’’ అని కర్ణాటక పోలీసు, జైళ్ల శాఖను జస్టిస్ పార్దీవాలా హెచ్చరించారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ చట్టం సమానంగా వర్తించాలి అని పునరుద్ఘాటిస్తూ.. దర్శన్‌పై ఉన్న ఆరోపణలు, అలాగే ఫోరెన్సిక్ ఆధారాలు.. బెయిల్ రద్దు చేయాల్సిన అవసరాన్ని బలపరిచాయని పేర్కొంది. ఈ విషయంలో మేము మా అసాధారణ అధికారాన్ని వినియోగించేందుకు సంతృప్తిగా ఉన్నాం అని కోర్టు ఉత్తర్వులో పేర్కొంది.
కేసు నేపథ్యం..
పోలీసుల అభియోగాల ప్రకారం.. చాలెంజింగ్ స్టార్ దర్శన్‌కు వీరాభిమాని అయిన రేణుకాస్వామి నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. 2024 జూన్‌లో దర్శన్, అతని సహచరులు రేణుకాస్వామిని అపహరించి, బెంగళూరులోని షెడ్‌లో మూడు రోజుల పాటు హింసించారు. అనంతరం అతని శవాన్ని డ్రెయిన్‌లో పడేశారు. ఈ కేసులో దర్శన, పవిత్రగౌడ, మరో 15 మంది అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో వాళ్లకు అందిన వీఐపీ ట్రీట్‌మెంట్‌పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో దర్శన్‌ను మరో జైలుకు మార్చారు. ఆపై వాళ్లు బెయిల్ మీద బయటకు వచ్చారు.
2024 డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక ప్రభుత్వం ఏడుగురి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అయితే విచారణలో దర్శన్‌కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. తాజాగా సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు కావడంతో దర్శన్ మళ్లీ అరెస్ట్ కానున్నాడు.
కేసు టైమ్‌లైన్
2024 జూన్ 8: రేణుకాస్వామి హత్య.. బెంగళూరులోని కామాక్షిపాళ్య ప్రాంతంలోని కాలువ ప్రాంతంలో దొరికిన మృతదేహాం
2024 జూన్ 11: నటుడు దర్శన్ అరెస్ట్
2024 జూన్: రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు.
2024 సెప్టెంబర్ 21: అనారోగ్య కారణంగా బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
2024 అక్టోబర్ 31: కర్ణాటక హైకోర్టు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
2024 డిసెంబర్ 13: హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
- 2025 జనవరి 24: దర్శన్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో కర్ణాటక ప్రభుత్వం పిటిషన్
2025 ఆగస్టు 14: దర్శన్ బెయిల్ రద్దు చేసిన సుప్రీం కోర్టు