
జీఎస్టీ నుంచి మినహాయించాలని ధర్నా
రాయచూరు రూరల్: విద్యా శాఖ ఆధీనంలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర సర్కారు ప్రవేశ పెట్టిన జీఎస్టీ నుంచి మినహాయించాలని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల సంఘం అధ్యక్షుడు మనోహర్ మస్కి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. విద్యా రంగంలో వెనుక బడిన కళ్యాణ కర్ణాటక భాగంలోని విద్యా సంస్థలకు ఆరోగ్య బీమా పథకం, ఆర్టీఈ ద్వారా చేర్చుకున్న విద్యార్థుల బకాయి నిధులను విడుదల చేయాలన్నారు. 25 ఏళ్ల నుంచి ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు మైదానాలు సమకూర్చాలని, అగ్నిమాపక కేంద్రం వాహనం వచ్చే విధంగా స్థలం వదలాలని నూతనంగా జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలన్నారు. ఎన్నికల వేళలో పాఠశాల వాహనాలను వినియోగిస్తున్నందున డీజిల్, డ్రైవర్ భత్యాన్ని చెల్లించాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా సీఎంకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో దరూరు బసవరాజ్, కేశవరెడ్డి, రవి, శ్రీనివాస్, థామస్, రజాక్ ఉస్తాద్‌లున్నారు.
రాజణ్ణను కేబినెట్‌లోకి తీసుకోవాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మంత్రి రాజణ్ణను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలని హైదరాబాద్ కర్ణాటక వాల్మీకి నాయక్ సంఘ్ కార్యదర్శి రఘువీర్ నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ అధిష్టానం మంత్రివర్గం నుంచి తొలగించడం తగదన్నారు. వాల్మీకి మండలిలో నిధుల గోల్‌మాల్‌పై బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్రను తొలగించారని గుర్తు చేశారు. ఎస్టీ వర్గాలపై కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూడడం తగదన్నారు. యాదగిరి జిల్లాలో అధిక శాతం నకిలీ నాయక్(ఎస్టీ) కుల ప్రమాణ పత్రాలు పొందడంపై బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు.
డిమాండ్లు తీర్చాలని
ఆశా కార్యకర్తల ధర్నా
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు నెలకు రూ.10 వేల చొప్పున వేతనాలు చెల్లించాలని ఆశా కార్యకర్తల సంఘం జిల్లాధ్యక్షుడు అయ్యాళప్ప డిమాండ్ చేశారు. మంగళవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు ఆందోళనలు కొనసాగించనున్నట్లు తెలిపారు. గతంలో రూ.10 వేలు వేతనం, అదనపు ఇన్సెంటివ్ భత్యాలు చెల్లిస్తామని చెప్పి 8 నెలలు గడుస్తున్నా నేటికీ సర్కార్ స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.వెయ్యి పెంచి ఆశా కార్యకర్తలకు పెంచలేదన్నారు. కేంద్రం ఇచ్చే ఇన్సెంటివ్ భత్యాలు, రాష్ట్ర సర్కార్ రూ.10 వేల వేతనం, పదవీ విరమణ చేసిన వారికి రూ.50 వేలు చెల్లించాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.
డిమాండ్లు పరిష్కరించకుంటే పోరాటం
హొసపేటె: ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల అశాసీ్త్రయ కేడర్, నియామక నియమాలకు తగిన సవరణలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సహా ఇతర డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లాధికారి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సంఘం జిల్లా యూనిట్ అధ్యక్షుడు శివానంద విలేకరులకు ఈ విషయాన్ని తెలియజేశారు. 2017 వరకు 1 నుంచి 7 వరకు నియమితులైన ఉపాధ్యాయులను ఉపాధ్యాయులుగా పరిగణించాలని, కొత్త కేడర్, నియామక నియమాలను (1) 2017 తర్వాత నియమించబడిన ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని సంఘం ప్రధాన డిమాండ్ అన్నారు. డిప్యూటీ కమిషనర్, జెడ్పీ సీఈఓ ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం పంపుతామని ఆయన తెలిపారు. ప్రభుత్వం తమ సహనాన్ని కూడా పరీక్షించకూడదని, రాబోయే రోజుల్లో పోరాటం తీవ్రతరం అవుతుందని అన్నారు. జాయింట్ సెక్రటరీ పి.గణేష్, ప్రముఖులు హిరే నాయక్, కుబేర ఆచార్, మల్లయ్య, విజయకుమారి, సిద్దమ్మ, నగేష్, జాకీర్ లోకప్ప తదితరులు పాల్గొన్నారు.

జీఎస్టీ నుంచి మినహాయించాలని ధర్నా

జీఎస్టీ నుంచి మినహాయించాలని ధర్నా

జీఎస్టీ నుంచి మినహాయించాలని ధర్నా