
కొనసాగిన వర్షాలు.. లోతట్టులోకి నీరు
హొసపేటె: గత మూడు రోజులుగా నిరంతరం కురుస్తున్న వర్షం కారణంగా నగరంలో రోడ్లపై పెద్దగా ట్రాఫిక్ లేదు. మార్కెట్లు కూడా గందరగోళంగా ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రజలు నిలబడటానికి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో, బస్సు ఎక్కేటప్పుడు వర్షంలో నిలబడి ఉండటం సర్వసాధారణంగా మారింది. అదే విధంగా లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు ఏరులా ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టీబీ డ్యాం పీఎల్‌సీ ప్రభుత్వ పాఠశాలతో పాటు అనేక పాఠశాలల ఆవరణల్లో వర్షం నీరు నిలబడటంతో విద్యార్థులకు కష్టంగా మారింది.
వర్షంలో తడిసిన హంపీ
ప్రపంచ ప్రఖ్యాత హంపీలో కురిసిన వర్షం హంపీ వైభవాన్ని మరింత పెంచింది. వర్షంలో స్మారక చిహ్నాల దృశ్యాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. వర్షపు జల్లుల మధ్య పర్యాటకులు హంపీ స్మారకాలను వీక్షించారు. శ్రీకృష్ణ ఆలయం, పాన్ సుపారీ బజార్, ఉగ్రనరసింహ, విజయవిఠల్ ఆలయ ప్రాంగణంలో నీరు నిలిచింది. వర్షపు నీటిలో స్మారకాల చిత్రాలు మరింత ఆకర్షణగా కనిపిస్తుండటంతో పర్యాటకులు, చూపరుల దృష్టిని ఆకట్టుకుంటోంది.
కళ్యాణ కర్ణాటకలో నిరంతర వర్షాలు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగాయి. ఎక్కడ చూసినా రహదారులు, ఇళ్లు, పంట పొలాలు నీట మునిగాయి. మూడు రోజుల నుంచి వర్షాలు పడ్డాయి. మంగళవారం తెల్లవారు జామున 2 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు భారీ వర్షం కురిిసింది. మాన్వి, దేవదుర్గ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు, పంట పొలాలు జలమయమయ్యాయి. మాన్వి తాలూకా వల్కందిన్ని, ముస్టూరు, ఉప్పరాళ, సంకనూరు గ్రామాలకు సంబంధాలు తెగి పోయాయి. వంతెనలపై నీరు ప్రవహించడంతో ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లడానికి వీలు లేక రాకపోకల సంబంధాలు తెగి పోయాయి. పత్తి, మిరప, వరి, కందులు, పొద్దు తిరుగుడు పంటలు నీటిలో మునిగాయి. రహదారిలో నీరు నిలిచి ప్రజలకు, వాహనాలకు ఇబ్బందులు కలిగాయి. సింధనూరు, మస్కి మధ్య రహదారి కోతకు గురైంది.

కొనసాగిన వర్షాలు.. లోతట్టులోకి నీరు

కొనసాగిన వర్షాలు.. లోతట్టులోకి నీరు