
మీరు దివ్యాంగులు కాదు, దివ్య శక్తివంతులు
బళ్లారిఅర్బన్: మీరు దివ్యమైన శక్తి కలిగిన వారని, మీకు ప్రత్యేకమైన జ్ఞానం, శక్తి ఉన్నాయని, వాటిని వాడుకొని సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని జిల్లా ఎస్పీ శోభారాణి దివ్యాంగులకు సూచించారు. సమర్థనం దివ్యాంగుల సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె దివ్యాంగులకు వివిధ పరికరాలను పంపిణీ చేసి మాట్లాడారు. వీటిని ఉపయోగించుకొని జీవితంలో ఎదగాలన్నారు. మిమ్మల్ని దివ్యాంగులు అని పిలవడానికి తన మనసు ఒప్పుకోవడం లేదన్నారు. జెడ్పీ సీఈఓ మహ్మద్ హ్యారీస్ మాట్లాడుతూ ఎస్పీ పేర్కొన్నట్లుగా మీరెవరూ శక్తి లేని వారు కాదన్నారు. మీలోని ప్రతి ఒక్కరిలో ప్రత్యేకమైన శక్తి యుక్తులు ఉన్నాయన్నారు. మీకు ఎవరి సానుభూతి అక్కర లేదన్నారు. అవకాశం లభిస్తే మీ జీవితాలను మీరే తీర్చిదిద్దుకోవడానికి మానసికంగా దృఢంగా ఉన్నారన్నారు. ఎంతో మంది శారీరకంగా బలవంతులు అయినా కూడా సోమరితనంతో కాలహరణం చేస్తుంటారన్నారు. ఈ విషయంలో అలాంటి వారికి మీరే ఆదర్శం అన్నారు. ప్రముఖులు పోలా రాధాకృష్ణ, నితీష్ కటారియా, సంగీత్ శర్మ, రేణుకాదేవి, గౌతమి, దివ్యాంగుల సంక్షేమ అధికారి గోవిందప్ప, శివరాం దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులు క్యాబిపర్స్ వీల్‌చైర్, ఊతకర్రలు, కుర్జీలు, ఊతకర్ర కుర్చీలు తదితర పరికరాలను సమర్థనం సంస్థ పంపిణీ చేసింది.