
అతి వేగం.. అనర్థం
మండ్య: వేగంగా వచ్చిన బైకు ఎదురుగా వస్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో బైకిస్టు అక్కడే దుర్మరణం చెందాడు. మండ్య తాలూకాలోని గుడిగెనహళ్ళి వద్ద జరిగింది. హునగనహళ్ళి వాసి గుండ (30), మండ్య వైపునుంచి స్వగ్రామానికి బైకులో అతి వేగంగా వెళ్తున్నాడు. ఘటనాస్థలిలో ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ఎగిరి పడి ప్రాణాలు కోల్పోయాడు. బసరాళు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
ఐటీలో విస్తృత ప్రగతి: సీఎం
శివాజీనగర: దేశంలోనే కర్ణాటక అతిపెద్ద స్థాయిలో ఐటీ సాఫ్ట్‌వేర్ ఎగుమతి చేస్తోందని, మన వాటా 44 శాతమని సీఎం సిద్దరామయ్య చెప్పారు. రాష్ట్ర ఆర్థికతలో సాంకేతిక పరిజ్ఞాన రంగం వాటా వాటా 26 శాతం ఉందని చెప్పారు. సోమవారం ఆయన టెక్ సమ్మిట్ గురించి మాట్లాడుతూ సిలికాన్ సిటీలో 2029 నాటికి ఐటీ రంగాన్ని మరింత విస్తరించి మూడున్నర లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది లక్ష్యమన్నారు. 50 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక ప్రగతిని సృష్టిస్తామన్నారు. ఏఐ లోనూ ప్రవంచంలో బెంగళూరు 5వ స్థానంలో ఉందని అన్నారు.
విష్ణు అభిమానుల ధర్నా
యశవంతపుర: బెంగళూరు కెంగేరి రింగ్‌రోడ్డులో దివంగత ప్రముఖ నటుడు విష్ణువర్ధన్ సమాధిని నేలమట్టం చేయడంపై అభిమానులు ఆక్రోశానికి గురవుతున్నారు. ఫిలిం చాంబర్ ముందు ఆందోళన చేశారు. కూల్చిన జాగాలోనే సమాధిని నిర్మించాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజుల కిందట స్థల యజమానులు విష్ణు సమాధిని తొలగించారు. మైసూరులో 2.75 ఎకరాలలో స్మారకం ఉన్నందున బెంగళూరులో మళ్లీ సమాధి అవసరం లేదని చెప్పడం సరికాదని అన్నారు.