
బెళగావిలో మరాఠీల ధర్నా
యశవంతపుర: బెళగావి జిల్లాలో కన్నడను అధికార భాషగా అమలు చేయరాదు, మరాఠీకి పెద్దపీట వేయాలని మరాఠా ఏకీకరణ సమితి కార్యకర్తలు సోమవారం ధర్నా చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన సాగించారు. బెళగావితో పాటు ఖానాపుర, నిప్పాణి తాలూకాల నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. బెళగావిలో కన్నడ భాషను కాకుండా మరాఠీ భాషనే మాట్లాడాలని డిమాండ్ చేశారు. గొడవలు జరగకుండా పోలీసులు మోహరించారు.
జనారణ్యంలో అరుదైన సర్పం
కోలారు: అడవులలో మాత్రమే కనిపించే విషపూరిత గ్రీన్ పిట్ వైపర్ పాము కోలారు నగరంలోని ఓ ఇంట్లో కనిపించింది. జయనగరలో ఉన్న ఆగ్రో కార్యాలయం వెనుక ఉన్న ఓ ఇంట్లో పామును చూసిన నివాసితులు స్నేక్ క్యాచర్ నాగరాజ్‌ను పిలిపించారు. నాగరాజ్ చేరుకుని దానిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశాడు. చెట్ల మీద జీవించే ఈ అరుదైన పాము జనావాసాలలో కనిపించడం అరుదు. కొందరు దీనిని పసరిక పాముగా పొరబడుతారు. త్రికోణాకారంలో తల, నున్నటి దేహం , పెద్ద కళ్లు కలిగిన ఈ పాము రాత్రి సమయాలలో ఎక్కువగా సంచరిస్తుంది. ఈశాన్య భారతదేశంతో పాటు కర్ణాటకలోని పశ్చిమ ఘాట్లలోనూ జీవిస్తుంటుంది. ఇది విషపూరితం కావడం వల్ల కాటేస్తే ప్రమాదమని నిపుణులు తెలిపారు.
బయట హోటల్..
లోపల హుక్కా బార్
దొడ్డబళ్లాపురం: అనుమతులు లేకుండా రెస్టారెంట్ పేరుతో నడుపుతున్న హుక్కా బార్‌పై పోలీసులు దాడి చేసి సీజ్ చేసిన సంఘటన రామనగరలో జరిగింది. రామనగర శివారులో మాదాపుర గేట్ వద్ద బెంగళూరు–మైసూరు రహదారి పక్కన ఫిల్టర్ కెఫె అండ్ కిచెన్ రెస్టారెంట్‌లో పోలీసులు సోదాలు చేశారు. లోపల హుక్కాబార్ నిర్వహిస్తున్నట్టు తేలింది. కస్టమర్లుగా వెళ్లిన పోలీసులు హుక్కాబార్‌ను సీజ్ చేసి నిర్వాహకుడు అరుణ్ కుమార్, హుక్కా మేకర్ అరుణాచల్‌ప్రదేశ్‌వాసి అనిల్ నజరి, యజమాని హేమంత్‌లపై కేసు నమోదు చేశారు. 11 హుక్కాలు, పొగాకు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
నవంబరులో టెక్ సమ్మిట్
శివాజీనగర: నవంబర్ 18 నుండి 20 వరకు బెంగళూరులో టెక్ సమ్మిట్ జరగనుంది. ఐటీ–బీటీ, గ్రామీణాభివృద్ధి మంత్రి ప్రియాంక ఖర్గే మాట్లాడుతూ ఆసియాలో అతిపెద్ద సాంకేతిక పరిజ్ఞాన ప్రదర్శనగా ఉంటుందన్నారు. బెంగళూరులోని అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రంలో ఈ సమ్మిట్ జరుగుతుంది. దేశ విదేశాల నుంచి ఐటీ, విజ్ఞాన కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు పాల్గొంటారని, 600 మందికి పైగా నిపుణులు ప్రసంగిస్తారని చెప్పారు. నూతన ఆవిష్కారాలతో వందలాది కంపెనీల స్టాళ్లు ఏర్పాటవుతాయని చెప్పారు.

బెళగావిలో మరాఠీల ధర్నా