
రద్దీ మార్గంలో సులభ ప్రయాణం
బనశంకరి: బెంగళూరు నగరంలో మెట్రో రైలు ఎల్లో మార్గం సోమవారం నుంచి ఆరంభమైంది. నగరవాసులు సంతోషంతో ప్రయాణించారు. ఆర్‌వీ రోడ్డు నుంచి బొమ్మసంద్ర వరకు ఈ మార్గం సుమారు 19 కిలోమీటర్లకు పైగా ఉంది. ప్రతి 25 నిమిషాలకు ఒకరైలు సంచరిస్తుంది. ఆ మూల నుంచి ఈ మూలకు వెళ్లడానికి సుమారు 35 నిమిషాలు పడుతుంది. 16 మెట్రో స్టేషన్లు ఈ మార్గంలో ఉన్నాయి. రాత్రి 11.15 గంటలకు చివరి సర్వీసు ఉంటుంది.
సమయం ఆదా
ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటోంది. దీని వల్ల భారీగా సమయం వృథా అవుతోంది. మెట్రో రైలు రాకతో ఈ ఇబ్బందులు తప్పినట్లు ప్రయాణికులు ఆనందం వ్యక్తంచేశారు. కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. జయనగర ఆర్‌వీ.రోడ్డు నుంచి ఎలక్ట్రానిక్‌సిటీ కి కేవలం 24 నిమిషాల్లో చేరుకోవచ్చని చెప్పారు. తొలి రోజు భారీ రద్దీ కనిపించింది. బోగీలన్నీ కిటకిటలాడాయి. ఈ మార్గంలో ఎక్కువ రైళ్లను నడపాలని కొందరు నెటిజన్లు కోరారు. మెట్రో అధికారులు స్పందిస్తూ అదనపు బోగీలు రాగానే ట్రిప్పులు పెంచుతామని తెలిపారు.