21 వేల ప్రభుత్వ పాఠశాలలు శిథిలం
బళ్లారిఅర్బన్: ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించి అభివృద్ధి పరచాలని ఏఐడీఎస్‌ఓ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ ఎదుట సామాన్య ప్రజలతో సంతకాల సేకరణ అభియాన్ చేపట్టారు. ఆ సంస్థ నేత సుభాష్ బెట్టదకొప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో 46,755 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 21,255 పాఠశాల భవనాలు శిథిలమై ప్రమాదంలో ఉన్నాయి. వీటిలో బళ్లారి జిల్లాలో 171 పాఠశాలలు ఉన్నాయన్నారు. గత కొన్నేళ్ల నుంచి దుస్థితిలో ఉంటూ మరమ్మతులకు నోచుకోక పైకప్పు కూలడంతో విద్యార్థులు గాయపడటం, కొన్ని చోట్ల ప్రాణాలు పోయిన ఘటనలు జరిగాయన్నారు.
పైకప్పు కూలి విద్యార్థిని మృతి
బళ్లారి తాలూకా శంకరబండలో 8వ తరగతికి చెందిన విద్యార్థినిపై పాఠశాల పైకప్పు కూలడంతో తీవ్రంగా గాయపడి, అనంతరం మృతి చెందిన ఘటన జరిగాయని గుర్తు చేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని పాఠశాలల దుస్థితికి నిదర్శనమని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు పేద పిల్లల ఆశాకిరణాలని, వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దే పునాది ప్రభుత్వ పాఠశాలలే అన్నారు. ఉపాధ్యాయులు తగినంత మంది లేక ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం దారుణం అన్నారు. ఆ మేరకు 6 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం తగదన్నారు.
విద్యా శాఖ మంత్రి ప్రకటన హాస్యాస్పదం
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ప్రకటన ఇస్తూ ప్రైవేట్ పాఠశాలల తరపున వాదిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నెల 29న పాఠశాలు పున: ప్రారంభం కానున్నాయి. ఈ సారి అత్యధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి తక్షణమే ఈ శిథిలమైన పాఠశాల భవనాలపై దృష్టి సారించి మరమ్మతులు చేపట్టాలి. అలాగే అవసరమైన మేరకు ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లాధ్యక్షుడు కే.ఈరణ్ణ, ఉపాధ్యక్షురాలు ఎం.శాంతి, ఉమా, నిహారిక, కంబళి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
వెంటనే మరమ్మతులు చేపట్టాలని అభియాన్
ఏఐడీఎస్‌ఓ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
21 వేల ప్రభుత్వ పాఠశాలలు శిథిలం


