‘అమర ప్రేమి అరుణ్’కు స్పందన భేష్
బళ్లారిటౌన్: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 25న విడుదలైన బళ్లారి చిత్ర నటులు నిర్మించిన అమర ప్రేమి అరుణ్ చిత్రానికి అపార స్పందన లభించినట్లు ఆ చిత్రం డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం పత్రికాభవనంలో సినిమా బృందంతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 సెంటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశామన్నారు. విడుదలైన 5 రోజుల్లో రోజురోజుకు ప్రేక్షకులు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో బళ్లారి జిల్లాకు చెందిన బాష, భావనలు, సంభాషణలు, పాటలు స్థానికులకు సంప్రదాయ పద్ధతిలో ఉండేలా నిర్మించామన్నారు. తాను పలు చిత్రాలకు సంభాషణలు రాశానని, యోగరాజ్ భట్ దర్శకత్వంలో ధనకాయువను, కూర్మావతారం చిత్రాలకు సహాయ డైరెక్టర్‌గా పని చేశానన్నారు. ఆ అనుభవంతో బళ్లారి జిల్లాలో ఈ చిత్రాన్ని 54 రోజుల పాటు సంగనకల్లు, మించేరి, హలకుంది, సిరవార, దుర్గమ్మ దేవస్థానం, కాగె పార్క్, బళ్లారి కొండ వంటి లోకేషన్లలో చిత్రీకరించామన్నారు. తన తండ్రి నాగేంద్ర బళ్లారి నగరంలో ఏఎస్‌ఐగా పని చేశారని, తాను కూడా బళ్లారిలోనే ఇంజినీరింగ్ చదివినట్లు తెలిపారు. తన తండ్రి మరణానంతరం చిత్ర రంగంలోకి ప్రవేశించినట్లు తెలిపారు. మరిన్ని చిత్రాలను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మంజమ్మ జోగతి కూడా జోగతి పాత్రను పోషించిందన్నారు. ఇక మండ్యకు చెందిన హరీష్ హీరోగా, బెంగళూరుకు చెందిన దీపిక ఆరాధ్య హీరోయిన్‌గా, సహ హీరోయిన్‌గా శృతి భట్, ధర్మణ్ణ తదితరులు నటించినట్లు తెలిపారు. సహాయక నిర్మాత మండ్య మంజు, ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.


