కన్నడలో మాట్లాడమన్నందుకు ప్రయాణికునిపై దాడి
సాక్షి,బళ్లారి: ఇటీవల కర్ణాటకలో పలు జిల్లాల్లో కన్నడలో మాట్లాడమన్నందుకు దాడులు జరుగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బెళగావి జిల్లాలో బస్సు కండక్టర్‌పై మరాఠీయులు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హంపీ ఎక్స్‌ప్రెస్ రైలులో అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. మైసూరు నుంచి బయలుదేరిన హంపీ ఎక్స్‌ప్రెస్ రైలులో యలహంక సమీపంలో టికెట్ కలెక్టర్ ప్రయాణికుని వద్దకు వచ్చి టికెట్ అడిగారు. మహమ్మద్ బాషా అనే ప్రయాణికుడిని హిందీ, ఇంగ్లిష్‌లో టికెట్ అడిగినందుకు కన్నడలో మాట్లాడాలని సూచించడంతో మాటామాటా పెరిగింది. టికెట్ కలెక్టర్‌కు కోపం రావడంతో ప్రయాణికుడిపై దాడి చేయడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కొప్పళలో ఆందోళన చేసి కర్ణాటకలో కన్నడలో మాట్లాడమని చెప్పడం తప్పా? అని ఆందోళనకారులు ప్రశ్నించారు.
సైకిల్ ఇవ్వనందుకు
చిన్నారి ఆత్మహత్య
సాక్షి,బళ్లారి: ప్రతి రోజు కలిసి ఆడుకుంటూ ఆనందంగా గడిపే ఇద్దరు చిన్నారుల్లో ఒక చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. చిత్రదుర్గ జిల్లా హిరియూరు పోలీసు స్టేషన్ పరిధిలో గోపాల్, రుద్రమ్మ దంపతుల కుమార్తె స్పందన (11) తన స్నేహితురాలు ఆడుకునేందుకు సైకిల్ ఇవ్వలేదని మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై హిరియూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి అదృశ్యం
హుబ్లీ: జిల్లాలోని కలఘటిగి పట్టణంలోని అక్కివీధి నివాసి బాహుబలి వసుపాల ఉపాధ్యే (59) అనే వ్యక్తి పనికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ ఘటనపై బంధువులు కలఘటిగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో తెలియజేయాలని కలఘటిగి పోలీసులు ఓ ప్రకటనలో కోరారు.
నిందితుల అరెస్ట్‌కు డిమాండ్
రాయచూరు రూరల్: వ్యక్తి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని వాల్మీకి సంఘం నాయకుడు వెంకటేష్ నాయక్ డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. గవిగట్టలోని తన భార్యను పిలుచుకు రావడానికి సిరవార తాలూకా హొక్రాణి నుంచి గత నెల 13న వెళ్లిన గూళప్ప అనే వ్యక్తిని భార్య తరపు బంధువులు చితక బాదడంతో అక్కడికక్కడే మరణించాడన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి నెల రోజులు గడుస్తున్నా అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆయన ఆరోపించారు.
తాగునీటి సరఫరా కోసం ధర్నా
హుబ్లీ: ఽదార్వాడ నగరంలోని వార్డుల్లో సజావుగా తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ హుబ్లీ ధార్వాడ నగర పాలక సంస్థ బీజేపీ కార్పొరేటర్లు ధార్వాడలో ఆందోళన చేపట్టారు. జిల్లా పంచాయతీ కార్యాలయ ఆవరణలో ధర్నా చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం, హెస్కాం, ఎల్‌ఎన్‌టీ కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేటర్ శివు హిరేమఠ మాట్లాడుతూ ఇంతకు ముందు నీటిని రెండు రోజులకు ఓ మారు వదిలేవారు. ఇప్పుడేమో 7, 8 రోజులు గడిచినా తాగునీరు సరఫరా కావడం లేదని ఆరోపించారు. ఈ విషయమై ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసినా నీటిని సరఫరా చేయలేదు. సవదత్తి జాక్‌వెల్‌లో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అందుకే నీటి సరఫరా సక్రమంగా కావడం లేదని ఎన్‌ఎన్‌టీ కంపెనీ వారు సాకులను చూపుతున్నారని అన్నారు. కొన్ని వార్డుల్లో 24 గంటలు నీటి సరఫరా వసతి ఉన్నా సజావుగా నీరు రావడం లేదు. అధికారులు సమాధానాలు చెప్పకుండా దాటవేస్తున్నారన్నారు. తక్షణమే నీటి సరఫరాకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడికి వచ్చిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంతోష్‌లాడ్ వినతిపత్రాన్ని స్వీకరించి తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అన్ని వార్డుల్లో సజావుగా నీటి సరఫరా కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్పొరేటర్లు సురేష్ బేదర, శంకర సేళకే, జ్యోతి పాటిల్, లక్ష్మీ హిండసగేరి, సీబీ కోటబాగి, నీలవ్వ అరవళద తదితరులు పాల్గొన్నారు.


