బస్సు ప్రాంగణం...పరిశుభ్రతకు గ్రహణం | Sakshi
Sakshi News home page

బస్సు ప్రాంగణం...పరిశుభ్రతకు గ్రహణం

Published Tue, Oct 10 2023 12:26 AM

బస్టాండు ఆవరణలో పేరుకున్న చెత్తకుప్ప దృశ్యం  - Sakshi

సాక్షి బళ్లారి: పేరుకే సువిశాలం.లోపలంతా అసౌకర్యాలమయం. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం వెరసి కేఎస్‌ఆర్టీసీ బస్టాండు అపరిశుభ్రతకు నిలయంగా మారింది. నిత్యం వందలాది బస్సులు, వేలాది ప్రయాణికులు సంచరించే ఆర్టీసీ బస్టాండులో కనీస సౌకర్యాలు లేకపోగా బస్టాండు అధ్వానంగా తయారైంది. స్టీల్‌ సిటీగా పేరుగాంచిన నగరంలో రెండు ప్రధాన బస్టాండ్లు ఉన్నాయి. వీటిలో రాయల్‌ సర్కిల్‌ సమీపంలోని బస్టాండు ఒకటి కాగా మరో ప్రధాన బస్టాండును బెంగళూరు రోడ్డులో సువిశాలంగా నిర్మించారు. ఈ బస్టాండులోకి బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, కర్నూలు, చైన్నె, ముంబై తదితర ప్రధాన నగరాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు వెళ్లి వచ్చే కేఎస్‌ఆర్టీసీ బస్సులతో పాటు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు కూడా వచ్చి వెళ్తుంటాయి. బళ్లారి ఆంధ్రా సరిహద్దున ఉండటంతో పొరుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ప్రయాణికులు వచ్చి వెళ్తుంటారు. సువిశాలంగా కనిపించే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉన్న ఆర్టీసీ బస్టాండులో కనీస సౌకర్యాలను కల్పించడంపై ఆర్టీసీ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎలాంటి చొరవ చూపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నిరుపయోగంగా వాటర్‌ ట్యాంక్‌

బస్టాండులో మంచినీటిని అందించేందుకు చిన్న ట్యాంకును ఏర్పాటు చేశారు కానీ అక్కడ మంచి నీరు దొరకడం లేదు. మంచినీటి కొళాయిల్లో నీరు రాకపోవడంతో ప్రయాణికులు ఒక్క లీటరు బాటిల్‌ను రూ.20–30లు పెట్టి కొనాల్సిందే. సామాన్య, మధ్యతరగతికి చెందిన ప్రయాణికులు డబ్బులు చెల్లించి మంచినీటి బాటిళ్లను కొనుగోలు చేసేందుకు అవస్థలు పడుతున్నారు. మంచినీటి సమస్యతో పాటు మరుగుదొడ్లలో శుభ్రత లోపించడంతో బస్టాండు ఆవరణలోనే బహిరంగ ప్రదేశంలో మూత్రవిసర్జన చేయడం సర్వసాధారణంగా కనిపిస్తోంది. ఇక రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలున్నాయి. ఈ బస్టాండు దగ్గర పోలీసుల గస్తీ లేకపోవడంతో కొందరు మందుబాబులు రాత్రిళ్లు చీకటి ప్రదేశంలో బస్టాండులోనే మందు, విందు చేసుకుంటున్నారని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛభారత్‌ అభియాన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకులు ఊకదంపుడు ఉపన్యాసాలు, ప్రకటనలిస్తున్నారే కానీ నిత్యం వేలాది మంది సంచరించే బస్టాండ్లలో స్వచ్ఛత లేకపోవడం గమనార్హం.

లోపించిన కనీస మౌలిక సదుపాయాలు

మంచినీటి కోసం ప్రయాణికుల తిప్పలు

డబ్బులు పెట్టి నీటి బాటిల్‌ కొనాల్సిందే

రాత్రివేళలో కొరవడిన పోలీసు శాఖ గస్తీ

బళ్లారిలోని సువిశాల కేఎస్‌ఆర్టీసీ ప్రధాన బస్టాండు
1/3

బళ్లారిలోని సువిశాల కేఎస్‌ఆర్టీసీ ప్రధాన బస్టాండు

మంచినీటి ట్యాంక్‌ వద్ద నెలకొన్న అపరిశుభ్రత
2/3

మంచినీటి ట్యాంక్‌ వద్ద నెలకొన్న అపరిశుభ్రత

ప్రయాణికుల ఆసనాల వద్ద లోపించిన పరిశుభ్రత
3/3

ప్రయాణికుల ఆసనాల వద్ద లోపించిన పరిశుభ్రత

Advertisement
 
Advertisement