ఢిల్లీకి వెళ్లిన సీఎం, డిప్యూటీ సీఎం 20 మందికి బెర్తులు ?

- - Sakshi

కర్ణాటక: మంత్రివర్గ విస్తరణకు కసరత్తు ప్రారంభమైంది. కాంగ్రెస్‌ హైకమాండ్‌తో కొత్త మంత్రుల ఎంపికపై చర్చించి విస్తరణకు ముహుర్తం నిర్ణయించడానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఈసారి సుమారు 20 మంది మంత్రులను చేర్చుకోవాలని సీఎం తీర్మానించారు. ఇటీవల సీఎం, డీసీఎం, మరో 8 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరికి ఏ శాఖ కేటాయించాలి అనేదానిపై హైకమాండ్‌తో చర్చిస్తారు. మంత్రి పదవుల కోసం తీవ్ర పైపోటీ నెలకొనడం ఒకెత్తయితే, ఇప్పుడు ఉన్న మంత్రులు ప్రధాన శాఖల కోసం లాబీయింగ్‌ చేస్తున్నారు.

హైకమాండ్‌పై ఒత్తిడి
పోటీ ఎక్కువగా ఉన్నందున ఎవరికి ఇవ్వాలి, ఎవరిని తప్పించాలి అనేది హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. కుల, ప్రాంతాలవారీగా అనేక అంశాల దృష్టిలో పెట్టుకుని మంత్రుల ఎంపిక జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులతో ఉభయులూ సమావేశమవుతారు. మంత్రుల జాబితా గురువారం సాయంత్రంలోగా ఫైనల్‌ కానుండగా, 27 లేదా 28వ తేదీ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందని అంచనా.

ఢిల్లీలో ఔత్సాహికుల మకాం
పదవుల రేసులో ఉన్న సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేసి పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. దినేశ్‌ గుండూరావ్‌, కృష్ణబైరేగౌడ, విజయానంద కాశప్పనవర్‌ తో పాటు పలువురు బుధవారమే ఢిల్లీకి బయలుదేరారు. మంత్రివర్గ విస్తరణ చేపట్టినా మరో నాలుగైదు స్థానాలు ఖాళీగానే ఉంచాలని హైకమాండ్‌ నిర్ణయించినట్లు వచ్చినట్లు సమాచారం. పదవుల కోసం మరీ గట్టిగా ఒత్తిడి చేస్తే వాటిలో నుంచి కేటాయించడానికి వీలుంటుంది.

అవకాశం అధికంగా ఉన్నవారు వీరే
శివానందపాటిల్‌, లక్ష్మణ సవది, గణేశ్‌ హుక్కేరి, ప్రకాష్‌ హుక్కేరి, ఎస్‌ఎస్‌ మల్లికార్జున్‌, ఈశ్వరఖండ్రే, కృష్ణభైరేగౌడ, ఎం.కృష్ణప్ప, దినేశ్‌ గుండూరావ్‌, తన్వీన్‌సేఠ్‌, బైరతి సురేశ్‌, రాఘవేంద్ర హిట్నాళ్‌, టీబీ.జయచంద్ర, కేఎన్‌.రాజణ్ణ, హంపనగౌడ బాదర్లి, సంతోష్‌లాడ్‌, వినయ్‌ కులకర్ణి, బసవరాజ శివణ్ణనవర్‌, ఆర్‌బీ.తిమ్మాపుర, బీకే.సంగమేశ్‌, మధు బంగారప్ప, చెలువరాయస్వామి, నరేంద్రస్వామి, ఎన్‌ఏ హ్యారిస్‌, లక్ష్మీ హెబ్బాళ్కర్‌, శరణప్రకాష్‌ పాటిల్‌.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top