పొదుపు మంత్రం నీటి మూటలేనా? నగరవ్యాప్తంగా నల్లా పైపుల లీకేజీలు నిత్యం వేలాది లీటర్ల తాగునీరు రోడ్డుపాలు నీటివృథాను అరికట్టడంలో బల్దియా విఫలం
కరీంనగర్ కార్పొరేషన్: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. అందులో కరీంనగర్ సిటీ కూడా ఉంది. ఇప్పటికే నగరంలోని చాలా చోట్ల బోర్లు ఎండిపోతున్నాయి. నల్లా నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. అపార్ట్‌మెంట్లు, కొ న్ని ప్రాంతాల్లో వాటర్‌ట్యాంకర్ల వినియోగం పెరి గింది. నగర తాగునీటికి ఆధారమైన ఎల్‌ఎండీలో ప్రస్తుతం 15టీఎంసీల వరకు నీటినిల్వ ఉంది. ఎల్‌ఎండీ నుంచి సాగుకు, ఇతర ప్రాంతాలకు నీళ్లు వదలకపోతే ప్రస్తుత నీటిసామర్థ్యంతో వేసవిని సు లువుగా దాటొచ్చు. కానీ.. ప్రతి రోజు వేలాది లీటర్ల నీరు నల్లా లీకేజీ కారణంగా వృథాగా పోతుండడమే ప్రస్తుతం కలవరం పెడుతున్న అంశం.
వేలాది లీటర్ల నీరు వృథా
మళ్లీ వర్షాకాలం వచ్చే వరకు వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీటినే పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే నీటివృథాను అరికట్టాలని, ప్రతి నీటిబొట్టును జాగ్రత్తగా వినియోగించుకోవాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా.. అధికార యంత్రాంగం ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. నగరంలో ప్రతిరోజు నల్లా పైప్‌లైన్ లీకేజీతో వేలాది లీటర్ల నీరు వృథాగా డ్రైనేజీల్లో కలిసిపోతున్నాయి. నగరంలో 17 రిజర్వాయర్లు ఉండగా, ఫిల్టర్‌బెడ్ నుంచి రిజర్వాయర్లకు, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతోంది. నిర్ణీత వేళల ప్రకారం రోజువిడిచి రోజు నీటి సరఫరా చేస్తారు. పైప్‌లైన్ లీకేజీలు నీటి సరఫరా తరహాలోనే నిరంతరం కొనసాగుతాయి. ఒక్కోసారి మెయిన్ పైప్‌లై న్ పగలడం, లీకవడంతో ఆ ప్రాంతమంతా వరద పారడం నగరంలో సాధారణంగా మారింది.
నాసిరకం పైప్‌లు
నగరవ్యాప్తంగా దాదాపు 800 కిలోమీటర్ల మేర తాగునీటి పైప్‌లైన్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో చాలాచోట్ల ఏళ్లక్రితం వేసిన ఏసీ, ఆర్‌సీసీ పైప్‌లు బలహీనంగా మారడంతో నిత్యం ఎక్కడో ఒకచోట పలుగుతూనే ఉంటాయి. పైప్‌ల జాయింట్లు, వాల్వ్‌ల వద్ద లీకేజీలు సాధారణంగా మారాయి. కొన్నేళ్ల నుంచి వాడుతున్న హెచ్‌డీపీఈ పైప్‌లు నాసిరకంగా ఉండడంతో లీకేజీలు మరింత పెరిగాయి. పైప్‌లైన్ నిర్మాణ సమయంలో సంబంధిత ఏఈ, డీఈ తదితరులు హెచ్‌డీపీఈ పైప్‌లు తయారు చేస్తున్న ఫ్యాక్టరీ వద్దకు వెళ్లి వాటి సామర్థ్యాన్ని సర్టిఫై చేయాలి. అప్పుడే కాంట్రాక్టర్ ఆ పైప్‌లను వేయాల్సి ఉంటుంది. కాని కొంతమంది అధికారులు పైప్‌ల తయారీ ఫ్యాక్టరీలకు వెళ్లి పరీక్షిస్తుండగా, మరికొంతమంది పరిశీలించకుండానే ఓకే చెప్పేస్తున్నారు. ఫలితంగా పైప్‌లు వేసిన కొద్దిరోజులకే లీకేజీ అవుతున్నాయి.
నగరపాలకసంస్థ పరిధిలో (విలీన గ్రామాలు కాకుండా) ప్రతిరోజు కనీసం 50 వరకు తాగునీటి పైప్‌లైన్ లీకేజీలు ఉంటాయని అధికారిక లెక్కలు. అనధికారికంగా మరిన్ని ఎక్కువే. ప్రతి రోజు 50,60 చోట్ల నల్లానీరు డ్రైనేజీలో కలిసిపోతుంటాయి. ప్రతిరోజు కొన్ని వేల లీటర్ల శుద్ధి చేసిన నల్లానీరు వృథాగా పోతున్నా, నగరపాలకసంస్థ అధికారులు ప్రజలకు నీటిని వృథా చేయరాదని చెప్పడానికే పరిమితమవుతున్నారు.
లీకేజీలు 50.. మరమ్మతులు 5
నగరంలో ఎక్కడ పైప్‌లైన్ లీకేజీ అయినా మరమ్మతు చేసేందుకు నగరపాలకసంస్థకు లీకేజీ లేబర్ ఉన్నారు. సరిపడా కార్మికులు లేకపోవడం, ఉన్న కార్మికులను ఇతర పనులకు వాడుకోవడంతో మరమ్మతులు సకాలంలో జరగక, వేలాది లీటర్లు వృథాగా రోడ్డుపాలవుతున్నాయి. నగరంలో దాదాపు 50 చోట్ల లీకేజీలు ఉంటే, సిబ్బంది ప్రతి రోజు కేవలం ఐదు నుంచి ఆరు లీకేజీలు మాత్రమే మరమ్మతు చేస్తున్నారు. పాత లీకేజీలు సరిచేస్తున్న క్రమంలోనే కొత్తగా లీకేజీలు పుట్టుకొస్తున్నాయి. ఈ లెక్కన కనీసం 50 లీకేజీలు తప్పకుండా కొనసాగుతూనే ఉన్నాయి.
రాష్ట్రంలో ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వేసవిలో తాగునీటికి కరువొచ్చే ప్రమాదం ఉంది. ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలి’.. అంటూ రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. అధికారయంత్రాంగం మాత్రం వేలాది లీటర్ల నీటిని లీకేజీల పేరిట ప్రతిరోజు వృథా చేస్తోంది. నగరంలో రోడ్డెక్కగానే కనిపించే నీటి లీకేజీ ప్రవాహాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.
అధికారులూ ఆచరించాలి
ఎల్‌నినోతో ముప్పు పొంచి ఉందని చెబుతున్న అధికారులు కళ్లముందు కనిపిస్తున్న నీటి వృథాను పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేలాది లీటర్ల నీరు ప్రతిరోజు వృథా అవుతున్నా ఎందుకు అరికట్టలేకపోతున్నారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఒక కుటుంబం ఒక రోజు వాడే నీటిని, ఒక లీకేజీ ఒకగంటలో వృథా చేస్తోందంటున్నారు. ప్రజలకు చెప్పేందుకు నీటి పొదుపు మంత్రం తప్ప, అధికారులు పాటించేందుకు కాదా అని నిలదీస్తున్నారు. ప్రజలకు చెప్పడమే కాదు, ఆచరణలోనూ చూపించాలని కోరుతున్నారు.
నగరంలోని మంచిర్యాల చౌరస్తాలో తాగునీటి లీకేజీ చూస్తున్నారు కదా. ఈ నీరు ఇలా నే పోతే గంటకు దాదాపు రెండువేల లీటర్లు రోడ్డుపాలవుతాయని అంచనా. ఈ లీకేజీ రోజుల తరబడి కొనసాగుతోంది. ఈ లెక్కన ప్రతిరోజు ఇక్కడి లీకేజీ నుంచే ఎన్ని వేల లీటర్ల నీరు వృథాగా రోడ్డుపై పోతాయో అంచనా వేస్తే ఆందోళనకరమే.


