అంజన్న చందనోత్సవానికి అంకురార్పణ | - | Sakshi
Sakshi News home page

అంజన్న చందనోత్సవానికి అంకురార్పణ

Nov 16 2026 12:08 AM | Updated on Nov 16 2026 12:08 AM

● కొండగట్టుకు ఆధ్యాత్మిక శోభ ● భక్తుల దర్శనాలు నిలిపివేత ● బాలాలయం ఏర్పాటు

మల్యాల: కొండగట్టు అంజన్న మూల విరాట్టుకు 60 ఏళ్ల అనంతరం చందనం తొలగించే మహా ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం మధ్యాహ్నం స్వామివారికి నివేదన అనంతరం దర్శనాలు నిలిపివేసి.. బాలాలయం ఏర్పాటు చేశారు. ప్రధాన అర్చకులు జితేంద్ర స్వామి, చిరంజీవ స్వామి, మారుతి ప్రసాద్‌, స్థానాచార్యులు కపీందర్‌, ఈవో అంజనారెడ్డి, ఏఈ వో హరిహరనాథ్‌, సూప రింటెండెంట్‌ సునీల్‌కుమార్‌, అశోక్‌ మేళతాళాల మధ్య నది జలాలతో పూజలు చేశారు. స్వామివారు, శ్రీవేంకటేశ్వర స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ప్రతిష్టించి పుణ్యాహచనం నిర్వహించారు. వేద పండితులు, వేద విద్యార్థులు, ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛరణల మధ్య బాలాలయం ఏర్పాటు చేశారు. చెక్కతో చేసిన స్వామివారి రూపాన్ని భక్తుల దర్శనం కోసం ఏర్పాటు చేశారు. సాయంత్రం శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, అంకురార్పణ, యాగశాల ద్వారతోరణార్చన, బలి ప్రదానం, శాత్తుమొరై, తీర్థ, ప్రసాద గోష్టి నిర్వహించారు.

జన్మధన్యం..

చందనోత్సవంలో పాల్గొనడం ద్వారా జన్మధన్యమైందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. మంచిర్యాలకు చెందిన కోటగిరి రవికుమార్‌ అందించిన నూతన వస్త్రాలను ఎమ్మెల్యే అర్చకులకు అందించారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకునే అవకాశం రావడం అదృష్టమన్నా రు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రత్యేక పనిముట్లతో చందనం తొలగింపు

పవిత్ర వృక్షాల కొమ్మలు, బంగారం, వెండితో కలగలసిన పనిముట్లతో స్వామివారి చందనం తొలగించనున్నారు. ఆలయంలో మూలవిరాట్టు ద్వా రం మూసివేసి, శాంతి హోమం నిర్వహించారు. భక్తుల దర్శనాల కోసం చెక్కతో చేసిన స్వామివారి రూపాన్ని బాలాలయంలో ఏర్పాటు చేశారు.

భక్తుల సందడి..

స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులతో ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. ఈ నెల 15 నుంచి 20 వరకు స్వామివారి మూలవిరాట్టు దర్శనంతోపాటు అన్ని ఆర్జిత సేవలు నిలిపివేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement