ఎన్‌హెచ్ 563 స్వరూపం
కరీంనగర్– జగిత్యాల ఎన్‌హెచ్ 563
విస్తరణకు మోక్షమెప్పుడో!
ఇరుకు రోడ్డుపై తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
గంగాధర రైల్వేగేటు వద్ద కిలోమీటర్ల మేర వాహనాల బారులు
పాత టెండర్ రద్దు..
కోట్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ ●:
జాతీయ రహదారి 563 కరీంనగర్– జగిత్యాల సెక్షన్ పనులకు మళ్లీ టెండర్లు పిలిచారు. గతేడాది పిలిచిన టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ప్రాజెక్టు కోసం మరోసారి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) టెండర్లు ఆహ్వానించింది. బిల్ట్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (బీవోటీ) విధానంలో ఈ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్గంలో వాహనాల రద్దీ పెరగడంతో ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న రోడ్డును నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనుంది. కరీంనగర్–జగిత్యాల మార్గంలో పారిశ్రామిక, వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు ఈరోడ్డు ఎంతగానో దోహదపడనుంది. 58 కి.మీ.ల పొడవైన ఈ మార్గానికి రూ.1979 కోట్ల అంచనా వ్యయానికి జూన్ మొదటివారంలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన క్రమంలో ఇటీవల కొత్త టెండర్లు మొదలయ్యాయి. సెప్టెంబరు 30 వరకు గుత్తేదార్లు టెండరులో పాల్గొనవచ్చు. అక్టోబరు 1న బిడ్లు ఓపెన్ చేయనున్నారు.
100 కిమీ స్పీడు..
రెండున్నరేళ్లలో పూర్తి
కరోనా తరువాత ఆకస్మికంగా పెరిగిన వాహన వినియోగం ఈ రోడ్డుపై మరింత భారాన్ని మోపుతోంది. రెండు లేన్లు కావడంతో ఓవర్ టేకింగ్ కష్టమవుతోంది. వీఐపీ కాన్వాయ్ ఇరుకు రోడ్డుపై తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ రోడ్డుపై 40 కి.మీ.లకు మించి వేగంతో వెళ్లలేమంటే రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. కరీంనగర్ నుంచి జగిత్యాలకు వెళ్లాలంటే 90 నిమిషాల వరకు పడుతుంది. కొత్త రోడ్డు అందుబాటులోకి వస్తే.. ఈ సమయం 45 నిమిషాలకు తగ్గుందని అధికారులు తెలిపారు. అంతేకాదు.. గరిష్టంగా 100 కిమీ వరకు వేగంగా ప్రయాణించవచ్చు. టెండరు అవార్డు అ య్యాక మొత్తంగా 910 రోజుల్లో అంటే దాదాపు 2.5 సంవత్సరాల్లో రోడ్డును పూర్తిచేయాల్సి ఉంటుంది. అంటే ఈ రోడ్డు 2029లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
గంగాధర రైల్వేగేటుతో కష్టాలు..
ఎన్‌హెచ్ 563 కరీంనగర్– జగిత్యాల సెక్షన్‌లో రోడ్డు విస్తరణకు నోచుకోక వాహనాల వేగం తగ్గింది. గంగాధర వద్ద రైల్వేగేటు ఈ కష్టాలను రెట్టింపు చేస్తోంది. రామగుండం నుంచి మహారాష్ట్రకు వెళ్లే గూడ్సు రైళ్లు, రెండు ప్యాసింజర్ రైళ్ల కారణంగా రోజుకు 10 నుంచి 12 సార్లు జాతీయ రహదారిపై రైలు గేటు పడుతోంది. దీంతో ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్రాక్‌కు రెండు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాల్సిన దుస్థితి. అంబులెన్సులు ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కుంటున్నాయి. గుండెపోటు, పాముకాటు, పురిటినొప్పులు వంటి అత్యవసర వైద్యసేవలు అందాల్సిన వారు నరకం చూస్తున్నారు. ఎన్‌హెచ్ 563 నిర్మాణ ప్రారంభమైతే ఇక్కడ ఆర్వోబీ నిర్మించనున్నారు. అలాగే, కరీంనగర్, గంగాధర, వెదిర, జగిత్యాల ప్రాంతాలకు బైపాస్‌లు అందుబాటులోకి వస్తాయి. అవకాశమున్న ప్రతీ గ్రామానికి గ్రామస్తులకు ట్రాఫిక్ చిక్కులు లేకుండా విలేజ్ అండర్ పాస్‌లు ఏర్పాటు చేస్తారు.


