కార్డుదారులకు అందని బియ్యం
పంపిణీకి మిగిలింది నాలుగు రోజులే
నైలెనా పూర్తికాని మూవ్‌మెంట్?
నిర్లక్ష్యానికి పరాకాష్ట.. కరీంనగర్ ఎంఎల్‌ఎస్ పాయింట్
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ ఎంఎల్‌ఎస్ పాయింట్ నిర్వాకం రేషన్ డీలర్లకు తీవ్ర తలనొప్పిగా మా రింది. బియ్యం ఎపుడొస్తాయో తెలియక పోగా.. నెల రోజులుగా మూవ్‌మెంట్ సాగదీస్తుండటం విడ్డూరంగా మారింది. గత నెల 27న కమిషనరేట్ నుంచి అలాట్‌మెంట్ జారీ కాగా నేటికి మూవ్‌మెంట్ నడుస్తోంది. 3 నెలల రేషన్ బియ్యం కావడంతో ఉదయం 9గంటలకే మూవ్‌మెంట్ కావాలని పౌరసరఫరాల సంస్థ డీఎం ఆదేశించగా.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. బియ్యం పంపిణీకి మరో నాలుగు రోజులే గడువుండగా స్టాక్ లేక రేషన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి.కార్డుదారులు దుకాణాల వైపు వెళ్లడం.. నిరాశగా వెనుదిరగడం నిత్యకృత్యమవుతోంది.
సమన్వయలోపమే శాపం
కరీంనగర్ ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచే కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, చిగురుమామిడి, గన్నేరువరం, మానకొండూరు, తిమ్మాపూర్ మండలాల రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా జరుగుతుంది. గోదాం అధికారిగా నాయబ్ తహసీల్దార్ వ్యవహరిస్తుండగా ఒకరు ఔట్‌సోర్సింగ్ ప్రతిపాదికన కొనసాగుతున్నారు. ఉన్న వాహనాలను రెండు, మూడు ట్రిప్పులు తిప్పడం లేదా అదనపు వాహనాలను సమకూర్చాల్సి ఉండగా, తదనుగుణ చర్యలు కరవయ్యాయి. వర్షాలను బూ చిగా చూపి రోడ్డు గుంతలుగా ఉందని స్టేజ్–2 గుత్తేదారు రవాణాకు మొండికేయడం, మట్టిపోయించడంలో పంతానికి దిగడం మూవ్‌మెంట్ నత్తనడకన సాగడానికి మరో కారణం.
ఎప్పుడొస్తాయో చెప్పేవారు కరవు
బియ్యం కోసం డీలర్ ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు వెళ్తే గంటల తరబడి వేచిచూడాల్సిందే. బియ్యం ఎప్పుడొస్తాయో చెప్పడం లేదు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని అడిగితే గోదాం అధికారిని అడగమని, గోదాం అధికారిని అడిగితే ఆ ఉద్యోగిని అడగాలని బంతాట ఆడుతున్నారని డీలర్లు వాపోతున్నారు. ఉదయం వెళ్తే సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సి వస్తోందని, తీరా రేపు పంపుతామంటూ వెనక్కి పంపిస్తున్నారని మండిపడుతున్నారు. మహిళా డీలర్లకు సదరు ప్రాంతంలో మూత్రశాలలు లేకపోగా కనీసం తాగేందుకు కూడా నీరుండదు.
గుత్తేదారు చెప్పిందే వేదం
ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద స్టేజ్–2 కాంట్రాక్టర్ హవానే నడుస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సకాలంలో వాహనాలు సమకూర్చకపోగా దురుసుగా ప్రవరిస్తారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3నెలల బియ్యం ఒకేసారి మూవ్‌మెంట్ జరగాలంటే తదనుగుణ ప్రణాళిక ఉండాల్సిందే. ఉన్న వాహనాలనే పెడుతూ రిపేర్లు అంటూ మొండికేయడంతో మూవ్‌మెంట్ జాప్యమవుతోంది. కేవలం 12 వాహనాలుండగా 6 గ్రామీణ ప్రాంతాలకు 6 కరీంనగర్‌కు కేటాయించామని చెబుతుండగా రోజుకు ఒక ట్రిప్పుకు మించి రవాణా చేయడం లేదని స్పష్టమవుతోంది.
బియ్యం పంపిణీ గడువులో సాధ్యమా?
3 నెలల రేషన్ బియ్యం కావడంతో ఈ నెల 31వరకు పంపిణీ అవకాశమిచ్చారు. రెగ్యులర్ బియ్యం రవాణా చేస్తుండగా ఇక పోర్టబిలిటీ రైస్ సరఫరా మొదలవలేదు. గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనుండగా ఆ లోపు రవాణా, డీలర్ల బియ్యం పంపిణీ సాధ్యమా అన్నది అంతుచిక్కని ప్రశ్న. ఒక్కో డీలర్‌కు 80క్వింటాళ్లు మూవ్‌మెంట్ చేస్తామని గోదాం అధికారి చెబుతుండగా ఒక్కో దుకాణానికి గరిష్టంగా 250 నుంచి 300 క్వింటాళ్లు బియ్యం రవాణా చేయాల్సి ఉంది. ఈ క్రమంలో పోర్టబులిటీ బియ్యంపై పీటముడి నెలకొంది.
నగరంలో 60 శాతమే పంపిణీ
నగరంలో జనాభా 4లక్షలు. జిల్లా జనాభాలో సగం జనాభా ఇక్కడే. వివిధ ప్రాంతాల ప్రజలు బతుకుదెరువు రీత్యా సిటీలో నివసిస్తుండగా ఎక్కడైనా రేషన్ బియ్యం తీసుకోవచ్చనే వెసులుబాటు ఉండటంతో ఇక్కడే తీసుకుంటున్నారు. దీంతో డీలర్ల వద్ద స్టాక్ తొందరగా ఖాళీ అవుతుండగా ప్రభుత్వం పోర్టబులిటీ అవకాశమిచ్చింది. అంటే అలాట్‌మెంట్ ప్రకారం బియ్యం ఇవ్వడంతో పాటు అదనంగా ఇండెంట్ పెట్టుకోవచ్చన్న మాట. ఒక్కో డీలర్ వద్ద గత సేల్స్‌ను పరిశీలిస్తే 60శాతమే పంపిణీ పూర్తయింది. ఇంకా 40శాతం ప్రజలకు రేషన్ అందాల్సి ఉంటుంది. మరీ నాలుగు రోజుల్లో మూవ్‌మెంట్ అయి పంపిణీ అయ్యేనా.. అధికారులకే తెలియాలి.


