సాక్షి, పెద్దపల్లి: ఒకప్పుడు జేబులో చిల్లర నాణేలు గలగలమంటేనే డబ్బున్న భావన. ఇప్పుడు డిజిటల్ రూపాయి, ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల దిశగా భారత రూపాయి ప్రయాణం సాగుతోంది. ఎనిమిది దశాబ్దాల స్వతంత్య్ర భారత చరిత్రలో డబ్బు రూపం ఎన్నోసార్లు మారింది. 1949లో స్వతంత్ర భారత ప్రభుత్వం రూపాయి నోటు ను విడుదల చేసింది. 2016లో పెద్దనోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులకు ఊతమిచ్చింది. యూపీఐ అందుబాటులోకి రావడంతో దేశ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పు వచ్చింది. చిన్న కిరాణా దుకాణం నుంచి పెద్ద సంస్థ వరకు.. కూరగాయల బండి నుంచి ఆన్‌లైన్ షాపింగ్ వరకు నగదు అవసరం తగ్గింది. ‘క్యాష్ ఉందా?’ అనే ప్రశ్నకు బదులుగా ‘స్కాన్ ఉందా?’ అనే మాట వినిపించడం ప్రారంభమైంది. ప్రస్తుతం ప్లాస్టిక్ కరెన్సీ దిశగా కరెన్సీ నవ భారత ప్రయాణం సాగుతోంది.


