ఆర్వోబీ కోసం అనుమానాస్పద టెండర్
డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి నెల వ్యవధిలో రెండుసార్లు ఆహ్వానం
ఒకే పనికి వేర్వేరు నంబర్లతో నోటీసులు
ఇటీవల యూఐడీఎఫ్ నిధుల డూప్లికేషన్
తాజాగా అదే ఘటనను పోలిన మరో వ్యవహారం
ఆర్‌అండ్‌బీ పనులపై బల్దియా ప్రేమ
జనాలకు తప్పని తిప్పలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
తీగలగుట్టపల్లి ఆర్వోబీ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. పనుల జాప్యానికి తోడు గోతులు పడిన రోడ్లతో ముక్కుతూ మూలుగుతూ ప్రయాణం చేస్తున్న ప్రజలకు కనీసం కొత్త డైవర్షన్ రోడ్డు ఇంతవరకూ అందుబాటులోకి రాలేదు. ఈ డైవర్షన్ రోడ్డు వ్యవహారం ఇపుడు చర్చానీయాంశంగా మారింది. రోడ్డు నిర్మాణానికి జూలై 7వ తేదీన రూ.28 లక్షల అంచనా వ్యయంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. ఈ టెండరు (నోటీసు నంబరు ఈ1/ డీబీ/ఎంసీకే /8201/274/2026–27/4)కు కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాకపోవడంతో రీకాల్ చేసింది. రీకాల్‌కు సైతం స్పందన రాకపోవడంతో రెండోసారి రీకాల్ పెట్టకుండా ఇదే పనికి కొత్తగా(నోటీసు నంబరు ఈ1/ డీబీ/ ఎంసీకే /8201/279/2026–27) ఆగస్టు 11తేదీన టెండరు పిలిచారు. దీని గడువు 20తో ముగుస్తుంది. ఒకే పనికి సంబంధించినవి రెండు టెండర్లు పిలవడం, వాటిలో ఐటెం క్వాంటిటీస్, రేట్లలో వ్యత్యాసాలు ఉండటం అనుమానాలకు దారి తీస్తుంది.
పని ఒకటే.. ఐటెంలు వేర్వేరు
ఒకే అధికారి రెండుసార్లు ఒకే అంచనా వ్యయంతో క్వాంటిటీస్, రేట్లతో ఒకే పనికి పరిపాలన, సాంకేతిక అనుమతులు ఎలా ఇచ్చారని కాంట్రాక్టర్లు చర్చించుకుంటున్నారు. ఒక టెండరుకు గుత్తేదార్ల నుంచి స్పందన రాని పక్షంలో 10 సార్లయినా రీకా ల్ చేసే అవకాశముంది. అంచనా వ్యయం మారకుండా అదే పనికి కొత్త టెండరు పిలవడం వెనక ఆంతర్యం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సాంకేతికంగా ఐటెం క్వాంటిటీ, రేట్లను మార్చి చూపించారు. ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఏ స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రకారం మార్చారో పేర్కొనలేదు. రెండు వేర్వేరు నంబర్లతో పిలిచిన ఈ టెండరును వేర్వేరుగా క్లెయిం చేసుకునే ప్రమాదముందని గుత్తేదార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. ఈ పనులు రోడ్లు భవనాలశాఖ చేపట్టాల్సి ఉండగా.. బల్దియా మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టడంపై విస్మయం చెందుతున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్ అధికారులను వివరణ కోరగా.. రోడ్డు నిర్మాణం తమ పరిధిలో లేదని రైల్వే, బల్దియా చూసుకుంటాయన్నారు. తొలి టెండరుకు స్పందన రాకపోవడంతోనే కొత్త టెండరు పిలవాల్సి వచ్చిందని బల్దియా కమిషనర్ కార్యాలయం టెండురును సమర్థించుకుంది. యూఐడీ ఎఫ్ టెండర్ల డూప్లికేషన్ మాదిరిగా ఈ టెండరుపైనా అనేక ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డైవర్షన్ రోడ్డు లేక ఉన్న మట్టి రోడ్డుపై గుంతల్లో వాహనదారులు పడుతూ లేస్తూ ప్రయాణాలు చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ గుంతల పరిమా ణం పెరిగిపోవడం కష్టాలు పెంచుతున్నాయి. గంటకోసారి రైల్వేగేటు పడుతోంది. వర్షం పడుతున్న సమయంలో గేటు పడినప్పుడు ద్విచక్రవాహనదారులు తడిసి ముద్దవుతున్నారు. ఇటీవల ఆర్వోబీకి సంబంధించిన భూసేకరణకు ఆటంకాలు తొలగినా.. ఆ ప్రక్రియ పూర్తయ్యే సరికి ఇంకెంతకాలం పడుతుందో? తమ కష్టాలు ఇంకెప్పుడు తీరుతాయో అని వాహనదారులు తమ దురదృష్టాన్ని తామే నిందించుకుంటున్నారు. ఇక గేటు పడిన సందర్భంలో అంబులెన్సు ట్రాఫిక్‌లో చిక్కుకుని రోగుల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారుతున్నాయి.


