కరీంనగర్: ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్‌లో భాగంగా కరీంనగర్‌లో బీజేపీ నార్త్ జోన్ అధ్యక్షుడు పాదం శివరాజ్ ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై.సునీల్‌రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ కోర్టు చౌరస్తా వరకు సాగింది. అక్కడ డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, బారి అపర్ణ– జితేందర్, కో– ఆప్షన్ మెంబర్ చిగురు రవి, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
మొక్కలను సంరక్షించాలి
కరీంనగర్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ గుండా వీరారెడ్డి సూచించారు. ఆస్పత్రి ఆవరణలో ఎన్‌ఎస్‌ఎస్ విభాగం, కరీంనగర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో గురువారం మొక్కలు నాటారు. వీరారెడ్డి మా ట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించినప్పుడే కార్యక్రమానికి పూర్తి సార్థకత చేకూరుతుందన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఎస్‌ఎస్ సూచనల మేరకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ‘హర్ ఘర్ తిరంగా’లో భాగంగా ఆగస్టు 9 నుంచి 17వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. ఆర్‌ఎంవో డాక్టర్ నవీన, డాక్టర్ ఉదయ్ ఆదిత్య, కరీంనగర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ లిల్లీ మేరీ, ఉమామహేశ్వరి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సుజాత, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్లతో నాణ్యమైన సరఫరా
కొత్తపల్లి (కరీంనగర్): వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యంగా కరీంనగర్ సర్కిల్ పరిధి లో ఇంటర్ లింక్ లైన్ల ఏర్పాటు చర్యలు వేగవంతం చేసినట్లు ఎస్‌ఈ ఆర్.రవీందర్ వివరించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో, నిర్వహణ సమయంలో, ఇతర కారణాల చేత ఒక లైన్‌లో లేదా సబ్ స్టేషన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో ఇంటర్ లింక్ లైన్ ద్వారా ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్లు ద్వారా సరఫరా కొనసాగుతుందన్నారు.
విస్తృత వాహన తనిఖీలు
కరీంనగర్‌క్రైం: కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసులు గురువారం అర్ధరాత్రి వరకు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాల పత్రాలు, డ్రంకెన్ డ్రైవ్, నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశారు. పలు వాహనాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. నగరంలోని హోటళ్లు, లాడ్జిల్లోనూ తనిఖీలు చేపట్టారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, రూరల్ ఏసీపీ జి.విజయ్‌కుమార్, సీఐలు రాంచందర్‌రావు, సృజన్‌రెడ్డి, తిరుమల్ పాల్గొన్నారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: కరీంనగర్‌లోని వావిలాలపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ ఐబీ ఫీడర్‌పై చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో ఉదయం 8 నుంచి 10.30 గంటల వరక ఐబీచౌరస్తా సర్కస్ గ్రౌండ్, పద్మనాయక కల్యాణ మండపం, సాఫ్రాన్ స్వీట్ హౌస్, కోర్ట్ చౌరస్తా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు టౌన్ 1 ఏడీఈ పంజాల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
కొత్తపల్లి ఫీడర్ పరిధిలో..
11 కేవీ కొత్తపల్లి ఎక్స్‌ప్రెస్ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత పనుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొత్తపల్లి టౌన్, రెడ్డిరాంపల్లి, తూర్పువాడ, మెడికల్ ఏరియా, రామాలయం ఏరియా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదని కరీంనగర్ రూరల్ ఏడీఈ జి.రఘు తెలిపారు.


