పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు
జిల్లాకు 34 లైబ్రరీలు మంజూరు
రూ.15వేల విలువైన పుస్తకాలు
ప్రతినెలా రూ.2 వేల నిర్వహణ నిధులు
విద్యాశాఖ ఆధ్వర్యంలో ఫర్నిచర్
కరీంనగర్ కల్చరల్: ఒక మంచి పుస్తకం విద్యార్థిలో ఆలోచనను పెంపొందిస్తుంది. ఆ ఆలోచన భవిష్యత్‌ను మార్చుతుంది. తరగతి గదిలో ఉపాధాయుడు చెప్పే పాఠంతో పాటు గ్రంథాలయంలో లభించే పుస్తకాలు విద్యార్థి జ్ఞానాన్ని మరింత విస్తరిస్తాయి. అందుకే పాఠశాలల్లో గ్రంథాలయానికి ప్రాధాన్యం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాకు 34గ్రంథాలయాలు మంజూరయ్యాయి. ఒక్కో గ్రంథాలయానికి రూ.15 వేల విలువైన పుస్తకాలు, ప్రతినెలా రూ.2 వేల నిర్వహణ నిధులతో పాటు.. విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చొని చదువుకునేలా అవసరమైన ఫర్నిచర్‌ను విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు.
రూ.15 వేల విలువైన పుస్తకాలు
ప్రతి గ్రంథాలయానికి రూ.15 వేల చొప్పున పుస్తకాలు కొనుగోలు చేసేందుకు నిధులు అందనున్నా యి. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పిల్లలకు అవసరమే పుస్తకాలను తీసుకునే అవకాశం ఉంది. కథలు, నవలలు, జీవిత చరిత్రలు, విజ్ఞానశాస్త్రం, సాధారణ జ్ఞానం, సాహిత్యం తదితర అంశాలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచితే విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
నెలనెలా నిర్వహణ నిధులు
గ్రంథాలయాలు కేవలం పుస్తకాలతోనే కాకుండా నిరంతరం కొత్త సమాచారం విద్యార్థులకు అందించే కేంద్రాలుగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి నెల రూ.2వేల చొప్పున నిర్వహణ నిధులు అందించనున్నారు. ఇందులో రూ.1,000 పత్రికల కోసం, మరో రూ.1,000 ఇతర అవసరాల కోసం వినియోగించనున్నట్లు సమాచారం. ఈ నిధులను గ్రంథాలయం నుంచి అందజేయనున్నట్లు గ్రంథాలయ పాలకులు పేర్కొంటున్నారు. విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చొని చదువుకునేందుకు అవసరమైన బల్లలు, కుర్చీలు, బుక్‌షెల్ఫ్‌లు తదితర ఫర్నిచర్‌ను జిల్లా విద్యాశాఖ సమకూర్చనుంది.
పుస్తకంతో మారే ఆలోచన
గ్రంథాలయం అంటే నాలుగు గోడల మధ్య పుస్తకాలను భద్రపరిచే గది మాత్రమే కాదు.. విద్యార్థి ఆలోచనలకు రెక్కలు తొడిగే జ్ఞాన కేంద్రం. పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా ఇతర పుస్తకాలు చదివే విద్యార్థుల్లో భాషా పరిజ్ఞానం, సాధారణ జ్ఞానం, సృజనాత్మకత, ఆలోచనా శక్తి పెరుగుతాయి. పోటీ పరీక్షలకు కూడా గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయి.


