ఆన్‌లైన్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు
పింఛన్ కోసం వచ్చిన పాత దరఖాస్తులు
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల తరువాత చేపట్టిన కొత్త పింఛన్‌దారుల ఎంపిక ప్రక్రియ నగరపాలకసంస్థలో మొదలైంది. ప్రస్తుతం వృద్ధాప్య, బీడికార్మికులు మినహా మిగతా కేటగిరీల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వాటిని ఆన్‌లైన్ చేసేందుకు నగరపాలకసంస్థ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు.
పాత దరఖాస్తులు 2 వేలు
నగరపాలకసంస్థ పరిధిలోని 66 డివిజన్ల నుంచి పింఛన్‌కోసం దాదాపు రెండు వేల మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. గతంలో నిర్వహించిన ప్రజాపాలన, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక, నగరపాలకసంస్థ పౌరసేవా కేంద్రం ద్వారా వివిధ సందర్భాల్లో గతంలో తీసుకున్న వాటిని పాత దరఖాస్తులుగా పరిగణిస్తున్నారు. వాటిని డివిజన్లవారీగా వేరు చేశారు. ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియను చేపట్టారు.
వృద్ధాప్య ఫించన్‌కు ఎదురుచూపులే
పింఛన్లలో ఎక్కువగా కనిపించే వృద్ధాప్య కేటగిరీకి ప్రస్తుతం అవకాశం కల్పించలేదు. వితంతు, దివ్యాంగులు, ఒంటరి మహిళ, చేనేత, గీతకార్మిక, పైలేరియా, తలసేమియా కేటగిరీలకు సంబంధించిన పింఛన్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈ కేటగిరీలకు సంబంధించిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేసేందుకు మాత్రమే ప్రభుత్వం లాగిన్ అవకాశం కల్పించింది. దీంతో వృద్ధాప్య, బీడీ కార్మికుల పింఛన్ దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు.
కొత్త దరఖాస్తులు 379
పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో, నగరపాలకసంస్థ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. నగరంలోని 66 డివిజన్‌లకు సంబంధించిన వార్డు అధికారులు,నగరపాలకసంస్థ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా కొత్త దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొదటి రోజు 272 దరఖాస్తులు రాగా, గురువారం 107 దరఖాస్తులు వచ్చాయి. కాగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసేందుకు ప్రత్యేకంగా పది లాగిన్లు ఏర్పాటు చేశారు.


