కొత్తపల్లి(కరీంనగర్): కరుడుగట్టిన అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఇద్దరిని శనివారం కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ బిల్ల కోటేశ్వర్ వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లా తాండా తాలూకాకు చెందిన కరుడుగట్టిన నలుగురు సభ్యుల ముఠా (థార్ గ్యాంగ్) ఇటీవల కరీంనగర్‌కు చేరుకుంది. కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రేకుర్తి, మల్కాపూర్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తూ అనుమానాస్పదంగా సంచరిస్తుండగా.. రేకుర్తి కంటి ఆసుపత్రి కమాన్ సమీపంలో సర్దు(25), సర్దార్(29)ను అదుపులోకి తీసుకున్నారు. దొంగతనానికి ఉపయోగించే సుత్తె, పానను స్వాధీనం చేసుకున్నారు. గతేడాడాది సంక్రాంతి సమయంలో చింతకుంట ప్రాంతంలో జరిగిన పలు దొంగతనాల్లో ప్రమేయం ఉన్నట్లు అంగీకరించారు. మళ్లీ దొంగతనాలకు పాల్పడేందుకు కరీంనగర్‌కు వచ్చినట్లు విచారణలో తేలింది. నలుగురు సభ్యుల ముఠాలో ఇద్దరు పరారైనట్లు, అరెస్ట్ చేసిన ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.


