జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ లేబర్‌గేట్ వద్ద రాజీవ్ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను దించేందుకు ఎన్టీపీసీ లేబర్‌గేట్ వద్ద రహదారి పక్కన ఆగింది. అదేసమయంలో పెద్దపల్లి నుంచి గోదావరిఖని వైపు వేగంగా వస్తున్న ఆటో ఆగిఉన్న బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్ ఎండీ షబ్బీర్‌తోపాటు అందులో ప్రయాణిస్తున్న మహానందు, చందు, మల్లవ్వ, గట్టమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాద వివరాలను సేకరించి, కేసు నమోదు చేసుకున్నారు.


