కరీంనగర్ కార్పొరేషన్: ఆత్మహత్యలను నివా రించడం సామాజిక బాధ్యత అని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ఆత్మహత్యల నివారణ కమిటీ రూపొందించిన పోస్టర్,కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఎంతటి కష్టాలు ఎదురైనా ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగడమే జీవితమన్నారు. ఆత్మహత్యలకు పాల్పడడం సరికాదన్నారు. ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్, సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ ఆత్మహత్య ప్రయత్నం చేసే వ్యక్తులతో సమాజం సానుభూతితో వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ భాస్కర్‌నాయక్, ఆడెపు సంపత్ పాల్గొన్నారు.
స్వయం ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
మహిళలు తమ నైపుణ్యాలు మెరుగుపరచుకొంటూ, స్వయం ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. బుధవారం నగరంలోని 12వ డివిజన్ రామచంద్రాపూర్‌కాలనీలో అభయ మహిళా సాధికార కేంద్రం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణు, అభయ మహిళా సాధికార కేంద్రం నిర్వాహకుడు బాలచంద్ర స్వామీజీ పాల్గొన్నారు.
హాస్పిటల్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలి
కరీంనగర్: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం–2010 కింద ఏర్పాటైన జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ జిల్లాస్థాయి సమావేశం బుధవారం రాత్రి కలెక్టరేట్లో జరిగింది. రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం పెండింగ్‌లో ఉన్న ఆస్పత్రుల వివరాలు, వివిధశాఖల నుంచి రావాల్సిన ఎన్‌వోసీల స్థితిగతులపై కలెక్టర్ ఆరా తీశారు. ఆలస్యానికి తావు లేకుండా పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి అన్ని దరఖాస్తులను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌తో పాటు సేవల చార్జీలు, టారిఫ్ వివరాలను ప్రజలకు కనిపించే విధంగా ప్రదర్శించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఎంహెచ్‌వో రాజగోపాలరావు, డెమో శ్రీనివాస్, జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సాయిని మల్లేశం
కరీంనగర్: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సాయిని మల్లేశం నియామకం అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు బుధవారం రాత్రి ఉత్వర్వులు జారీ చేశారు. సాయిని మల్లేశం ఉమ్మడి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా, లీగల్ సెల్ కార్యదర్శిగా, న్యాయవాది పరిషత్ ఉమ్మడి స్టేట్ కార్యదర్శిగా పనిచేశారు. హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా మూడుసార్లు కొనసాగారు. మల్లేశంతో పాటు బోయినపల్లి ప్రవీణ్ రావు, గుజ్జ శ్రీను పేర్లు పరిశీలించి, హైకమాండ్ మల్లేశం పేరును ఖరారు చేసింది. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావుకు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
రేపు మెగా జాబ్ మేళా
కరీంనగర్ సిటీ: కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో ఈనెల 7వ తేదీ శుక్రవారం ఉదయం 9:00 గంటలకు కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వరలక్ష్మి బుధవారం తెలిపారు. ప్రముఖ సంస్థలైన ఫాక్స్‌కనాన్, జోన్ సొల్యూషన్స్, పీఎస్ సొల్యూషన్స్, సహస్ర సాప్ట్‌వేర్ సొల్యూషన్స్‌తో పాటు పలు సంస్థలు పాల్గొని అర్హులైన మహిళా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. పీజీతో పాటు అన్ని డిగ్రీ కోర్సులు పూర్తిచేసిన మహిళా అభ్యర్థులు అర్హులని తెలిపారు. అభ్యర్థులు సెల్‌ఫోన్, రెజ్యూమ్, ఎసెస్సీ, ఇంటర్, డిగ్రీ మెమోలు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు శివ 78931 86719, పవిత్ర 78930 82090, రాజశేఖర్ 99120 93500 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


