● సిద్దిపేట ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
ముస్తాబాద్(సిరిసిల్ల): సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడగా, వారి స్వగ్రామాల్లో విషాదం నెలకొంది. సిద్దిపేట, ముస్తాబాద్ ప్రధాన రహదారిపై బచ్చాయిపల్లె వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముస్తాబాద్ మండలానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. బందనకల్‌కు చెందిన తుపాకుల సాయి(31) తన బుల్లెట్ వాహనంపై సోమవారం సాయంత్రం సిద్దిపేటకు వెళ్లాడు. అదే సమయంలో మద్దికుంటకు చెందిన ఇల్లెందుల మల్లేశం(34) తన బైక్‌పై సిద్దిపేట నుంచి ముస్తాబాద్ వైపు వస్తున్నాడు. వీరి వాహనాలు బచ్చాయిపల్లె వద్ద ఎదురెదురుగా వేగంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో సాయి అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన మల్లేశం సిద్దిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. సాయి మృతితో అతడి భార్య నవ్య, ఇద్దరు కుమారులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మల్లేశం మృతితో భార్య భవాని, కుమార్తెలు జయశ్రీ, ఖడ్గేశ్వరీ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


