ధర్మపురి: ఇంటిముందు మూత్ర విసర్జనకు వెళ్లిన పసి బాలుడు పాముకాటుకు బలైన ఘటన ధర్మపురిలో విషాదం నింపింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పట్టణంలోని దుర్గమ్మకాలనీకి చెందిన ముస్కు రాజవ్వకు కుమారుడు లోకేశ్ (4) ఉన్నాడు. రాజవ్వ కొత్తగా ఇల్లు కట్టుకుని ఇటీవలే గృహ ప్రవేశం చేసింది. ఆ ఇంట్లోనే తల్లితో కలిసి లోకేశ్ సోమవారం రాత్రి పడుకున్నాడు. మంగళవారం ఉదయం లేచి ఇంటిముందు మూత్ర విసర్జనకు వెళ్లాడు. అదే సమయంలో నాగుపాము బాలుడి కాలుపై కాటు వేసింది. అతని తాత సాంబయ్య గమనించి చికిత్స నిమిత్తం ముందుగా స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో జగిత్యాల తరలించేందుకు 108కు సమాచారం అందించారు. అంబులెన్సులో ఎక్కిస్తుండగానే బాలుడు మృతిచెందాడు. లోకేశ్ ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకు పాముకాటుతో చనిపోవడంతో ఆ తల్లి గుండలవిసేలా రోధించింది. రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు.
మూత్రవిసర్జన చేస్తుండగా కాటు
తల్లిదండ్రులకు తీరని పుత్రశోకం
ఇటీవలే కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం
సంబరం నిండాల్సిన ఇంట విషాదం


