కరీంనగర్ అర్బన్: జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించేందుకు రవాణా, పోలీస్, నేషనల్ హైవే అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. జిల్లా రహదారి భద్రతా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో నివేదికను సిద్ధం చేయాలన్నారు. ‘రైట్ ఆఫ్ వే‘ మార్గం వెంబడి కొత్తగా ఎలాంటి వాణిజ్య నిర్మాణాలు అనుమతించరాదని, మున్సిపల్, ట్రేడ్ లైసెన్స్ వంటివి ‘రైట్ ఆఫ్ వే‘ వెలుపల ఏర్పాటు చేయకుండా చూడాలన్నారు. జాతీయ రహదారుల వెంట ఆక్రమణలు పరిశీలించేందుకు, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు డ్రోన్ ద్వారా నిఘా ఉంచాలన్నారు. పెట్రోలింగ్, అక్రమ పార్కింగ్ వంటి అంశాలను పర్యవేక్షించాలన్నారు. స్పీడ్ డిటెక్టర్లు, కెమెరాలు, సైన్ బోర్డులు, ఎమర్జెన్సీ కాల్ బాక్సులు పరిశీలించాలన్నారు. బ్లాక్ స్పాట్ వద్ద హైమాస్డ్ లైటింగ్, స్పీడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కెమెరాలు, మెట్రో రిప్లేక్టివ్ హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ వైద్య సహాయం కోసం సమీప ఆసుపత్రులను మ్యాపింగ్ చేయాలని తెలిపారు. ఈ సౌకర్యాలను పరిశీలించాలని, లేని చోట్ల అవసరమైన చర్యలు తీసుకుని నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని పేర్కొన్నారు.


