కరీంనగర్ కార్పొరేషన్: ప్రజల భాగస్వామ్యంతో సీజనల్, అంటువ్యాధుల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివా స్ తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో వర్షాకాలంలో సీజనల్, అంటువ్యాధులను నివారించడం లక్ష్యంగా చేపట్టిన సఫాయి అప్నావో– బీమారీ భగావో కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో రోజువారీ పారిశుధ్య పనులను మెరుగుపరిచేందుకు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తున్నామన్నారు. నగర ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, సంక్షేమ సంఘాల భాగస్వామ్యంతో మార్కెట్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్, ఇతర ప్రజా ప్రదేశాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వర్షపు నీళ్లు నిలిచే ప్రాంతాలను గుర్తించడం, నీళ్లను మళ్లించడం, చెత్తాచెదారం తొలగించడం, డ్రైనేజీల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను శుభ్రం చేయడం, దోమల నివారణ కోసం యాంటీ లార్వా ఆపరేషన్లు, ఫాగింగ్, స్ప్రేయింగ్ విస్తృతంగా చేస్తామన్నారు. కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, అదనపు కమిషనర్లు ఆయాజ్, సువార్త, సహాయ కమిషనర్లున్నారు.


