● ‘సెస్’ పాలకవర్గం కేసును కొట్టేసిన కోర్టు
● ఎన్‌పీడీసీఎల్ పరిధిలో పూర్తిస్థాయి ఆజమాయిషీ
● సహకార చట్టం ప్రకారం ‘సెస్’ అక్రమాలపై విచారణ
● విచారణ అధికారిగా జగిత్యాల డీసీవో మనోజ్‌కుమార్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలు అందించిన సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ (సెస్) పాలకవర్గ ఆశలు ఆవిరయ్యాయి. పాలకవర్గం కేసును కొట్టివేస్తూ సోమవారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ‘సెస్’ పరిధిలో పూర్తి స్థాయి విద్యుత్ పంపిణీ సేవలను ఎన్‌పీడీసీఎల్ నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. ‘సెస్’కు సహకార చట్ట ప్రకారం ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన పాలకవర్గం ఉండగా.. సంస్థను ఎలా రద్దు చేస్తారని పేర్కొంటూ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు ఏప్రిల్‌లో కోర్టును ఆశ్రయించగా, నాలుగు నెలలుగా విచారణ జరిపింది. ‘సెస్’కు ఎన్నికై న పాలకవర్గం ఉండగా.. వ్యాపార లైసెన్స్ ఇవ్వకుండా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని పాలకవర్గం న్యాయవాది వాదించగా.. ‘సెస్’ అక్రమాలకు పాల్పడిందంటూ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఆధారాలను కోర్టు ముందు ఉంచినట్లు సమాచారం. అన్నీ పరిశీలించిన కోర్టు ఈ కేసును కొట్టివేసింది. దీంతో ‘సెస్’ కథ ముగిసింది.. పాలకవర్గం కల చెదిరిపోయింది.
లైసెన్స్‌తో మొదలై.. కోర్టు తీర్పు వరకు
‘సెస్’ వ్యాపార లైసెన్స్‌ను రెన్యువల్ చేయకుండా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) ఎన్‌పీడీసీఎల్ పరిధిలోకి మార్చుతూ ఏప్రిల్ 1న ఆదేశాలు జారీ చేసింది. సంస్థను రద్దు చేస్తున్నట్లు టీజీఈఆర్‌సీ నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయిలో విద్యుత్ పంపిణీ వ్యాపార లైసెన్స్‌ను ఎన్‌పీడీసీఎల్‌కు జారీ చేసింది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో విద్యుత్ సేవలను నాలుగు నెలలుగా ఎన్‌పీడీసీఎల్ నిర్వహిస్తుంది. తాజాగా కోర్టు తీర్పుతో పూర్తిస్థాయి ఆజమాయిషీ లభించినట్లు అయింది.
అక్రమాలపై విచారణ
‘సెస్’ పాలకవర్గాల చేసిన అవినీతి, అక్రమాలపై సహకార చట్టం– 51 ప్రకారం విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. 2014 నుంచి 2026 వరకు ‘సెస్’ పరిధిలో జరిగిన అన్ని పరిపాలనా పరమైన నిర్ణయాలపై విచారణకు ఆదేశాలు జారీ చేస్తూ సంస్థ ఎండీ తిరుపతి మెమో జారీ చేశారు. విచారణ అధికారిగా జగిత్యాల జిల్లా సహకార అధికారి సీహెచ్ మనోజ్‌కుమార్‌ను నియమించారు. ‘సెస్’బైలాస్, సర్వీస్ కండిషన్స్, ఉద్యోగుల నియామకాలు, మహాసభ మినిట్స్, డే బుక్స్, పేబిల్స్ తదితర వాటిని పరిశీలించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. విచారణలో ఏమైనా అక్రమాలు వెలుగు చూస్తే పాలకవర్గాన్ని రద్దు చేయడంతో పాటు, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం దుర్వినియోగమైన సొమ్మును తిరిగి వసూలు చేసే అవకాశం ఉంటుంది.
పాలకవర్గంలో అంతర్మథనం
తాజా పరిణామాలతో ‘సెస్’పాలకవర్గంలో అంతర్మథనం మొదలైంది. కోర్టుపై పెట్టుకున్న ఆశలు ఆవిరికావడంతో పాలకవర్గానికి పాలుపోవడం లేదు. ఇంకా 16 నెలల పదవీకాలం ఉండగానే ఇలా అర్థాంతరంగా ‘సెస్’ రద్దు కావడం అనూహ్య పరిణామంగా భావిస్తున్నారు. కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలనే ఆలోచన ఉండగా.. ఆ దిశగా వెళ్తే పాలకవర్గం కంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు, ఎన్‌పీడీసీఎల్ మరోవైపు మరింత బలమైన వాదనతో సుప్రీంకోర్టులోనూ సవాల్ చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఏది ఏమైనా తాజా పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో (ఒకప్పటి సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలు) 56 ఏళ్లుగా విద్యుత్ పంపిణీ సేవలు అందించిన సహకార విద్యుత్ సరఫరా సంఘం ఇక కాలగమనంలో కలిసిపోనుంది.


