జమ్మికుంట: అనారోగ్య కారణాలతో మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన పెరుక రాజ్యయ్య(58) అనే వ్యక్తి జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామంలో 18 సంవత్సరాలుగా హమాలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సంవత్సరం క్రితం నుంచి పక్షవాతంతో బాధపడుతున్నాడు. దుర్గాకాలనీ సమీపంలో గుర్తుతెలియని ఎగువ రైలు కింద పడి దుర్మరణం చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, నలుగురు కుమార్తెలున్నారు. మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.


