రాజన్నకు నాద‘స్వరాలు’! | - | Sakshi
Sakshi News home page

రాజన్నకు నాద‘స్వరాలు’!

Jul 22 2026 10:59 AM | Updated on Jul 22 2026 10:59 AM

● ముగ్గురు వాయిద్య కళాకారుల సేవలు

వేములవాడ: తరతరాలుగా నాదస్వరాన్ని, సన్నాయి వాయిద్యాన్ని దైవసేవకే అంకితం చేసిన కళాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. వేములవాడ రాజన్న సేవలో తరించేందుకు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ముగ్గురు వాయిద్య కళాకారులు ఎంపికయ్యారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 21 వాయిద్య కళాకారుల ఉద్యోగుల్లో గద్వాలకు చెందిన కళాకారులకు చోటు దక్కింది.

ఏళ్ల నిరీక్షణకు ప్రతిఫలం

ఆలయాల్లో మంగళ వాయిద్యాలు మోగిస్తూ దైవ సన్నిధిలో సేవలు అందిస్తున్న కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్‌ చాన్నాళ్లుగా ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఎం.నరేష్‌ (డోలు), రామకృష్ణ (శ్రుతి), ఎం.రవికుమార్‌(సన్నాయి) రాజన్న ఆలయంలో సేవలందిస్తున్నారు. తమ మంగళ వాయిద్యాలతో స్వామివారిని సేవించే భాగ్యం కలగడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అంజన్న సన్నిధిలో వరుణయాగం

మల్యాల: వర్షాలు కురవాలని కోరుతూ కొండగట్టు అంజన్న ఆలయంలో మంగళవారం వరుణ యాగం నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయం ఆవరణలో ప్రత్యేక మంటపం ఏర్పాటు చేశారు. అర్చకులు శ్రీఆంజనేయస్వామి ఉత్సవ మూర్తికి విశేష అభిషేకం, పూజలు చేశారు. స్థానాచార్యులు కపీందర్‌, ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవస్వామి, మారుతి ప్రసాద్‌, చిన్నరాము, వేద పండితులు రాజేశ్వర శర్మ, పెద్దన్న శర్మ, తేజ శర్మ ఆధ్వర్యంలో వరుణయాగం, పూర్ణాహుతి, పుష్కరిణిలో వరుణ జపం నిర్వహించారు. ఈవో అంజనా రెడ్డి, ఏఈవో హరిహరనాథ్‌, సూపరింటెండెంట్‌ సునీల్‌, చంద్రశేఖర్‌, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.

తిరుమలకు ప్రత్యేక రైలు

కరీంనగర్‌రూరల్‌: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల భక్తుల కోసం మంగళవారం నుంచి నాందేడ్‌ –తిరుచానూరు ప్రత్యేక రైలు అందుబాటులోకి వచ్చింది. కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌కు రాత్రి 8.30 గంటలకు వచ్చిన ప్రత్యేక రైలుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్వాగతంపలికారు. వారంలో రెండు పర్యాయాలు రైలు అందుబాటులో ఉంటుంది. ప్రతీమంగళవారం మధ్యాహ్నం 2.45 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి బుధవారం ఉదయం 11గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. ప్రతీ బుధవారం మధ్యాహ్నం 1.20 గంటలకు తిరుచానూరులో బయలుదేరి గురువారం ఉదయం 8 గంటలకు నాందేడ్‌ చేరుకుంటుంది. ప్రత్యేక రైలు (07603) ఈనెల 21 నుంచి ఆగస్టు 25 వరకు ప్రతీ మంగళవారం నడుస్తుంది. తిరుచానూరు–నాందేడ్‌ రైలు(07604) ఈ నెల 22 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. ముద్‌ఖేడ్‌, ధర్మాబాద్‌, బాసర, నిజామాబాద్‌, ఆర్మూర్‌, కోరుట్ల, లింగంపేట, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ప్రతీ మంగళవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కోరుట్లకు 18.30 గంటలకు, జగిత్యాలకు 19 గంటలకు, కరీంనగర్‌కు 20.28 గంటలకు, పెద్దపల్లికి 21గంటలకు, జమ్మికుంటకు 22 గంటలకు చేరుకుంటుంది. కేవలం ధర్డ్‌ ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయని, జనరల్‌ కోచ్‌లుండవని కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌ కమర్షియల్‌ మేనేజరు భానుచందర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement