కరీంనగర్ క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసు ఛేదనను రాష్ట్ర పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 112 మంది ట్రైనీ డీఎస్పీలకు కేస్‌స్టడీగా వివరించారు. డీజీపీ సీవీ.ఆనంద్ ఆదేశాలతో కరీంనగర్ సీపీ గౌస్‌ఆలం కేసు దర్యాప్తులో అనుసరించిన వ్యూహాలు, సాంకేతిక పరిజ్ఞానం, క్షేత్రస్థాయి సవాళ్లను మూడున్నర గంటల పాటు వివరించారు. నిందితులు అత్యాధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించినప్పటికీ, తెలంగాణ పోలీస్‌శాఖలో అందుబాటులో ఉన్న సాంకేతిక సాధనాలు, డేటా విశ్లేషణ, ఇంటెలిజెన్స్ సేకరణతో కేసును విజయవంతంగా ఛేదించిన విధానాన్ని వివరించారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక బృందాలు బిహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర (ముంబై), కర్ణాటక (బెంగళూరు) ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టి, స్థానిక పోలీసుల సహకారంతో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసిన తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, రూరల్ ఏసీపీ విజయకుమార్, సీఐలు సృజన్‌రెడ్డి, శ్రీనివాస్, రమేశ్, తిరుమల్, ప్రకాశ్, సరిలాల్ తమ అనుభవాలను పంచుకున్నారు.
తెలంగాణ పోలీస్ అకాడమీలో బోధించిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం


