గంగాధర: పదిహేను రోజులుగా వ్యవసాయానికి సరిగా విద్యుత్ సరఫరా కావడం లేదని, తరచూ అంతరాయం కలుగుతోందని, తమ సమస్యను పట్టించుకునే వారు కరువయ్యారని మండలంలోని చర్లపల్లి (ఎన్) గ్రామానికి చెందిన రైతులు గురువారం గంగాధరలోని సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. రాత్రి పూట వ్యవసాయ విద్యుత్ ఉండడం లేదని, పొద్దంతా తరచూ అంతరాయం ఏర్పడుతోందని, అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు లేక నారుమడులు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. ఎస్సై వంశీకృష్ణ రైతులు, విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


