చందుర్తి(వేములవాడ): తండ్రి చిన్ననాడే మృతిచెందగా తల్లి అమ్మమ్మ వద్దే ఉంటుండడంతో అమ్మను, అమ్మమ్మను చూసేందుకు వెళ్తూ ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన వడ్నాల రాజేశ్వరీ వివాహాన్ని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తితో చేశారు. వీరికి కొడుకు రాజు, కూతురు జన్మించిన తర్వాత తండ్రి మృతిచెందాడు. అప్పటి నుంచి రాజేశ్వరీ ఇద్దరి పిల్లలతో తల్లిగారి ఊరు బావుసాయిపేటలోనే ఉంటోంది. కొడుకు రాజు వేములవాడలోని పెద్దమ్మ యాదవ్వ ఇంట్లో ఉంటూ ఇంటర్ చదువుతూ, హెయిర్ సెలూన్‌లో పనిచేస్తున్నాడు. గురువారం అమ్మను, అమ్మమ్మను చూసేందుకు బావుసాయిపేటకు స్నేహితుడు కోనరావుపేట మండలం జై సేవాలాల్ భూక్యారెడ్డితండాకు చెందిన భూక్యా ఆకాశ్‌తో బైక్‌పై బయలుదేరాడు. చందుర్తి మండలం ఎన్గల్ శివారులో ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో వడ్నాల రాజు(17) అక్కడిక్కడే మృతి చెందగా, భూక్యా ఆకాష్ తల వెనుక భాగం పగిలింది. వెంటనే 108 అంబులెన్స్‌లో వేములవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన కారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాటిపెల్లికి చెందిందని తెలిసింది. వీరు అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా మృతుడి తల్లి రాజేశ్వరీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.
సైడ్‌బర్మ్స్ లేకనే ప్రమాదం
వేములవాడరూరల్ మండలం హన్మాజిపేట నుంచి చందుర్తి మండలం ఎన్గల్, బండపల్లి మీదగా కోనరావుపేట మండలం బావుసాయిపేట వరకు 10.8 కిలో మీటర్లు తారు రోడ్డు పోశారు. కానీ నాలుగేళ్లు గడుస్తున్నా రోడ్డుకు ఇరువైపులా సైడ్‌బర్మ్స్ మొరం పోయించకపోవడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. సైడ్‌బర్మ్స్ పోయించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు చర్చించుకున్నారు.
ఎన్గల్ శివారులో బైక్‌ను ఢీకొట్టిన కారు
సంఘటన స్థలంలోనే యువకుడి మృతి
మరొకరికి తీవ్ర గాయాలు


