జాతీయ కీర్తి.. కావాలి సారథి | - | Sakshi
Sakshi News home page

జాతీయ కీర్తి.. కావాలి సారథి

Jul 16 2026 5:00 AM | Updated on Jul 16 2026 5:00 AM

‘చొప్పదండి’పై డైలమాలో ‘జిల్లా సహకార’ అధికారులు

కేడీసీసీబీకి ముగిసిన పర్సన్‌ ఇన్‌చార్జి పాలన

అందని రుణాలు.. పెండింగ్‌లో ఫైళ్లు

స్తంభించిన లావాదేవీలు

ఉమ్మడి జిల్లాలో 8ప్యాక్స్‌లకే పాలకవర్గం

మిగతా 123కు పాత పాలకవర్గాలే

కరీంనగర్‌ అర్బన్‌: దేశవ్యాప్తంగా కీర్తి గడించిన కరీంనగర్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సారథి లేకుండా సాగుతోంది. గత జూన్‌ 11తో పర్సన్‌ ఇన్‌చార్జి పాలన ముగిసింది. కలెక్టర్‌ సదరు బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పరిపాలన స్తంభించింది. కీలక వ్యవహారాలన్నీ అటకెక్కాయి. వ్యాపారులు రుణా ల కోసం దరఖాస్తు చేస్తే ఫైళ్లు గుట్టల్లా పెరిగిపోతున్నాయి. ప్యాక్స్‌ల పరిస్థితి అంతే. నామినేటెడ్‌ పద్ధతిలో పాలకవర్గాలను ప్రకటించాల్సి ఉండగా కేవలం 8కే పరిమితం కాగా, మిగతా 123 పాత పాలకవర్గాలతో నెట్టుకొస్తున్నాయి.

ఘనకీర్తి.. ఎందుకీ దుస్థితి

2005–06లో రూ.57.92కోట్ల నష్టాలతో ఉన్న కేడీసీసీబీ పరిస్థితులు చైర్మన్‌ నియామకంతో పూర్తిగా మారిపోయాయి. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సేవలందిస్తుండగా దేశంలోనే ఉత్తమ అవార్డులు వరించాయి. గతంలో రూ.402కోట్లుగా ఉన్న బ్యాంకు వ్యాపారం నేడు రూ.8వేల కోట్లకు చేరింది. గత పదేళ్లుగా ఏటా రూ.వంద కోట్ల లాభాలు గడిస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 131 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు అతి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తూ వాణిజ్య బ్యాంకులకు పోటీనిస్తోంది. గ్రామీణ ప్రజానీకానికి వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలివ్వడం, రుణేతర సేవలు, పెట్రోల్‌ బంకులు, ఫంక్షన్‌ హాళ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, జనౌషధి కేంద్రాలు, గిడ్డంగులు, సోలార్‌ ప్లాంట్లు, డ్రోన్‌ల సేవలు, వ్యాపార సముదాయాలు, వాటర్‌ ప్లాంట్లు వంటి సేవలందిస్తోంది.

చైర్మనా.. పర్సన్‌ ఇన్‌చార్జా?

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చైర్మన్లను, డైరెక్టర్లను నియమించగా సదరు పాలకవర్గాన్ని తొలగించి పర్సన్‌ ఇన్‌చార్జిగా కలెక్టర్‌ను నియమించారు. సదరు పరిపాలన గడువు గత నెల 11తో ముగిసింది. నామినేటేడ్‌ పద్ధతిలో పాలకవర్గాన్ని ప్రకటిస్తారని భావించినప్పటికీ నేటికీ జాప్యం జరుగుతుండటం పరిపాలనపై ప్రభావం చూపుతోంది. నిర్ణయాలు తీసుకోవాలంటే జనరల్‌ బాడీ మీటింగ్‌ తప్పనిసరి కాగా.. రుణాల ఫైళ్లు పేరుకుపోతున్నాయి.

మానకొండూరులో ఎనిమిది మినహా..

ఉమ్మడి జిల్లాలో మానకొండూరు నియోజకవర్గంలో 8 ప్యాక్స్‌లు మినహా పాలకవర్గాలను ప్రకటించలేదు. మానకొండూరు, దేవంపల్లి, గట్టుదుద్దెనపల్లి, మెట్‌పల్లి, గద్దపాక, తాడికల్‌, పోరండ్ల, నుస్తులాపూర్‌ పాలకవర్గాలను నామినేటేడ్‌ చేశారు. ఊ టూరు, బెజ్జంకి, ఇల్లంతకుంట, గాలిపల్లి పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరో 123 సంఘాలు అధికారులతోనే సాగుతున్నాయి. 131 చైర్మన్‌, 131 వైస్‌ చైర్మన్‌ పదవులతో పాటు ఒక్కో సహకార సంఘంలో 13మంది డైరెక్టర్లుంటారు. వీరి మద్దతుతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు నియమితులయ్యేవారు. ప్రభుత్వం నామినేటెడ్‌ నిర్ణయంతో ఇక వీరంతా నామినేటెడ్‌ పద్ధతిలోనే భర్తీ జరగాల్సి ఉండగా నేటికి స్పష్టత లేదు.

అవార్డు ఇచ్చిన చేతితో ఎలా తొలగిస్తాం

చొప్పదండి: రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలకు నామినేటెడ్‌ పాలకవర్గాలను నియమిస్తూ వస్తున్న సహకారశాఖ అధికారులకు జాతీయస్థాయిలో మూడు అవార్డులు అందుకున్న చొప్పదండి పీఏసీఎస్‌ పాలకవర్గాన్ని రద్దు చేయడం సవాల్‌గా మారింది. పీఏసీఎ స్‌లకు కాంగ్రెస్‌ ఆశావహులను చైర్మన్‌, డైరెక్టర్లుగా నియమిస్తుండగా, చొప్పదండి పీఏసీఎ స్‌లో కొత్త పాలకవర్గం నియామకం తలనొ ప్పిగా మారింది. చొప్పదండి సహకార సంఘం దేశంలోని 96వేల సహకార సంఘాలకు ఆదర్శంగా నిలిచింది. 29 రాష్ట్రాల్లోని సహకారశాఖ అధికారులు, పాలకవర్గాలు ఇక్కడి పనితీరును పరిశీలించారు. ఇటీవల పాలకవర్గం పదవీకాలం పూర్తి కావడంతో జిల్లా సహకార అధికారి బాధ్యతలు స్వీకరించినా కోర్టు తీర్పు మేరకు పాత పాలకవర్గమే కొనసాగుతోంది. పీఏసీఎస్‌లకు నూతన పాలకవర్గాల ఏర్పాటు నేపథ్యంలో చొప్పదండిలో సందిగ్ధం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement