గత జూన్‌లో కురిసిన వర్షం: 13రోజులు
నమోదైన వర్షపాతం: 162.6మిల్లిమీటర్లు
గత జూలైలో (13వరకు) కురిసిన వర్షం:8రోజులు
నమోదైన వర్షపాతం: 172.8మి.మీలు
నెల పడిన వర్షం పడాల్సినది వర్షపాతం
జూన్ 84.3 124.3 లోటు వర్షం
జూలై
(ఇప్పటివరకు) 72.7 237.7 లోటువర్షం
కరీంనగర్ అర్బన్: ఎల్‌నినో ప్రభావం జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. సకాలంలో కురవాల్సిన వర్షాలు ముఖం చాటేయడంతో సాగు నేలలోని మొక్కలు వాడిపోతున్నాయి. ఈ నెలలో 13రోజులు గడువగా ఇప్పటికి 3 రోజులు వర్షం పడటం.. అంతంతమాత్రమే కావడం సాగు రంగాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. గతంలో అతివృష్టితో సాగురంగం కుదేలవగా తాజాగా డ్రైస్పెల్(ఎక్కువ రోజులు వర్ష విరామం)తో అన్నదాతను ఆందోళనలో పడేస్తోంది.
మెట్ట ప్రాంతాల్లో ఘోరం
మెట్ట ప్రాంతాలైనా గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాలు కరవులో అతలాకుతలమవుతున్నాయి. గతంలో కరవు మండలాలుగా ప్రకటించిన దాఖలాలుండగా ఈ మూడు మండలాలు సదరు జాబితాలో ఉండేవి. ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ పనులతో పాటు చెట్లను వృద్ధి చేయడం వంటి వాటితో పరిస్థితి మారిపోగా ఎల్‌నినోతో మళ్లీ మొదటికొచ్చింది. అత్యల్ప వర్షపాతం నమోదవుతోంది. ఇప్పటివరకు నమోదైన వర్షపాతాన్ని గమనిస్తే అన్ని మండలాల్లో లోటు వర్షపాతమే. మొత్తంగా జిల్లా సగటున లోటు వర్షపాతమే నమోదైందని గణాంక శాఖ స్పష్టం చేస్తోంది.
ముంచుకొస్తున్న విత్తన గడువు
ఆశించిన వర్షపాతం లేకపోవడంతో పంటలు సాగు చేసేందుకు రైతులు అచితూచి వ్యవహరిస్తున్నారు. కాలువలు పారకపోగా వాగుల్లోనే జల కళ లేదు. ప్రాజెక్టులు అడుగంటగా.. ఎల్‌ఎండీ డెడ్ స్టోరేజీకి చేరింది. ఈ క్రమంలో విత్తన గడువు ముంచుకొస్తుండగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ‘సాగు’డన్నది అంతుచిక్కడం లేదు. ఈ నెల 15వరకు పత్తి సాగు చేసుకోవచ్చు. ఆ తరువాత విత్తుకుంటే దిగుబడిపై ప్రభావం పడుతుంది. కంది, మినుము, పెసర పంటలను జులై 15వ తేదీ వరకు విత్తుకోవాలన్నది శాస్త్రవేత్తల మాట. కందిని పత్తి, మొక్కజొన్న పంటల్లో అంతర పంటగా సాగు చేయొచ్చు. ఇక వరికి సంబంధించి దీర్ఘకాలిక రకాలను జూన్ 20వరకు, మధ్యకాలిక రకాలు జూలై 10వరకు నార్లు పోయాలి. జూలై 31వరకు స్వల్పకాలిక రకాలను నార్లు పోసుకునేందుకు అనుకూలం. ఆగస్టు 15వరకు అన్ని రకాల వరి నాట్లు పూర్తి చేయాలి. నార్లు పోసుకున్నప్పటికి ప్రస్తుత పరిస్థితుల క్రమంలో నాట్లు వేసుకోవడం కష్టమే. బావులు, బోర్ల కింద నాట్లు వేస్తుండగా కాలువల కింద ఇంకా పొలాలను సిద్ధం చేయలేదు. ఇక మిరప పంటను జూలై 15వరకు నాటుకోవచ్చు. నారు పోసుకుని నాటుకోవచ్చు. నేరుగా సాలు పద్ధతిలో కూడా మిరప విత్తనాలను నాటవచ్చు. మొక్కజొన్న పంటను జూలై 15 వరకు సాగు చేసుకోవచ్చు. మొక్కజొన్నను ఏక పంటగా కాకుండా కందితో కలిపి అంతర పంటగా వేసుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతుండగా వర్షలేమి వల్ల విత్తనం ఎలా మొలుస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


