కరీంనగర్ టౌన్: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం కల్పించే జేఎన్‌వీఎస్‌టీ–2027 పరీక్షకు జిల్లాలోని అర్హత కలిగిన ప్రతి విద్యార్థి దరఖాస్తు చేసేలా దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే ఆదేశించారు. చొప్పదండి నవోదయలో 2027 –28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై మంగళవారం జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఐదో తరగతి చదువుతున్న సుమారు 11వేల మంది విద్యార్థులు ఉన్నారని, అందరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. డీఈవో ప్రశాంత్‌రెడ్డి, జెడ్పీ సీఈవో పవన్ కుమార్, డీపీవో జగదీశ్వర్, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అయాజ్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపల్ కమిషనర్లు కిషన్, మల్లికార్జున్, నాగరాజు, చొప్పదండి నవోదయ ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.
హుజూరాబాద్: మధ్యాహ్న భోజన సిబ్బంది వంటగదులను పరిశుభ్రంగా ఉంచి, విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని డీఈవో నరెడ్ల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. గంగిశెట్టి మధురమ్మ ట్రస్ట్ చైర్మన్ జగదీశ్వర్ ఆధ్వర్యంలో మండలంలోని 120మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు, సహాయకులకు మంగళవారం పట్టణంలో చీరలు పంపిణీ చేశారు. సిబ్బందికి బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంఈవో విడపు శ్రీనివాస్, అకడమిక్ మానిటరింగ్ అధికారి కర్ర అశోక్ రెడ్డి, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు దేవారం మేరి శోభారాణి, అనురాధ, శ్రీభవాని పాల్గొన్నారు.
కరీంనగర్: వ్యాక్సిన్ ద్వారా నివారించగల వ్యాధుల (వీపీడీ) పర్యవేక్షణలో ప్రతి వైద్యాధికారి, సూపర్‌వైజర్, ఫీల్డ్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎంహెచ్‌వో శ్రీరామ్ సూచించారు. మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ‘వ్యాక్సిన్ ద్వారా నివారించగల వ్యాధుల సర్వైలెన్స్– అవసరం అమలు’ అనే అంశంపై నిర్వహించిన ఒకరోజు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. శ్రీరామ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అనుమానిత కేసులను వెంటనే నివేదించి, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో రాజగోపాల్‌రావు, వైద్యులు మహమ్మద్ షుజాయత్, మనోహర్, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్ సిటీ: విద్యార్థులు ట్యాలీలో నూతన అకౌంటింగ్ సాంకేతికతను నేర్చుకోవాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్ సూచించారు. ఎస్‌యూ వాణిజ్యశాస్త్ర విభాగ ఆధ్వర్యంలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కోసం చేపట్టిన ‘అకడమిక్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్–100 రోజుల కార్యాచరణ’లో భాగంగా ‘‘కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ యూజింగ్ ట్యాలీ ఈఆర్‌పీ 9ఏ స్కిల్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్’ అనే మూడు రోజుల శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. విద్యార్థులకు ట్యాలీ ఈఆర్‌పీ 9లో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ నిర్వహణ, వౌచర్ ఎంట్రీ, జీఎస్టీ అకౌంటింగ్, ఇన్వెంటరీ, పేరోల్, బ్యాంకింగ్, ఆర్థిక నివేదికలు, డేటా భద్రతపై శిక్షణ ఇవ్వనున్నారు. వీసీ ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ నూతన అకౌంటింగ్ సాంకేతికతలను నేర్చుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్ పి.సతీశ్‌కుమార్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ ఎన్.వి. శ్రీరంగప్రసాద్ పాల్గొన్నారు.


