కరీంనగర్ కార్పొరేషన్: గడువు సమీపిస్తుండడంతో నగరంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. నిర్ణీత గడువు 24వ తేదీకి మరో తొమ్మిదిరోజులే మిగిలి ఉండగా, ఆ లోగా వందశాతం ప్రక్రియను పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో నగరపాలకసంస్థ స్టాఫ్ సర్ ప్రక్రియలో తిరుగుతుండగా, రెగ్యులర్ సేవల్లో జాప్యంతో బల్దియాకు వచ్చిన ప్రజలు నిరాశగా వెనుదిరుగుతున్నారు.
సర్‌లోనే అంతా
ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ నగరంలో మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు ఆన్‌లైన్ నమోదు 30శాతం కూడా దాటడం లేదు. గడువు పొడిగింపు ఉండదు, నిర్ణీత గడువులోగా వందశాతం పూర్తిచేయాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో నగరంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతంచేసేందుకు బల్దియా స్టాఫ్‌ను పూర్తిగా క్షేత్రస్థాయికి పంపించారు. ఎస్‌ఐఆర్ సూపర్‌వైజర్‌లుగా నగరపాలకసంస్థ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, వార్డు అధికారులు, మానిటరింగ్ అధికారులుగా ఇంజినీరింగ్, రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ అధికారులు, బీఎల్‌వోలకు సపోర్టింగ్ స్టాఫ్‌గా కంప్యూటర్ ఆపరేటర్లు, శానిటేషన్ జవాన్లు, శానిటేషన్ కార్మికుల సేవలనూ వినియోగించుకొంటున్నారు. ఓటర్లకు ఇచ్చిన ఫారాలను పూరించారా, తిరిగి ఇచ్చారా అనేది శానిటేషన్ కార్మికులు, జవాన్లు ఇంటింటికి తిరిగి ఆరా తీస్తున్నారు.


