మానకొండూర్: చిన్నారుల పాదాలు సర్కారు బడి వైపు బుడిబుడి అడుగులు వేస్తున్నాయి. పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి. ప్రభుత్వ వినూత్న ఆలోచనలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రభుత్వ బడుల బలోపేతమే ధ్యేయంగా తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో ప్రీ ప్రైమరీ ప్రవేశాలు జోరందుకున్నాయి. జూలై 2వరకు 974మంది అడ్మిషన్లు తీసుకోగా.. జూలై 9 నాటికి ఆ సంఖ్య 1,160కు చేరింది. 14 నాటికి మరో 70 మంది నూతనంగా ప్రవేశాలు తీసుకున్నారు. రెండు వారాల వ్యవధిలో 256 మంది కొత్తగా జాయిన్ అయ్యారు. విద్యాశాఖ చేపట్టిన ప్రత్యేక నమోదు కార్యక్రమాలు, గ్రామస్థాయిలో ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు కల్పిస్తున్న అవగాహనతో ప్రీపైమరీ తరగతి గదులు కళకళలాడుతున్నాయి.
ప్రభుత్వ బడుల బలోపేతమే ధ్యేయంగా
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే ధ్యేయంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను మండలాల వారీగా ఎంపిక చేసింది. ఆయా పాఠశాలలకు ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను నియమించారు. స్కూళ్లలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు బోధిస్తుండగా తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 83 ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఎంపిక చేయగా రామడుగు, గంగాధర, చిగురుమామిడి, హుజూరాబాద్, జమ్మికుంట, తిమ్మాపూర్, కొత్తపల్లి, శంకరపట్నం, మానకొండూర్, సైదాపూర్ మండలాల్లోని ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. ఒక్కో తరగతి గది 20 నుంచి 34 మంది వరకు చిన్నారులతో కళకళలాడుతున్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం రాబోతుంది. గతంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మాధ్యమం లేక పోవడంతో పిల్లలు ప్రైవేటు బాట పట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రీప్రైమరీ తరగతులు ఏరా్పాటు చేస్తోంది. జిల్లాలో 83 బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నాం. వీటి అభివృద్ధికి రూ.లక్ష వరకు నిధులు వెచ్చిస్తాం. గదులను అందంగా తీర్చుదిద్దుతాం.
– ప్రశాంత్‌రెడ్డి, డీఈవో


