పథకాలు చేరడమే లక్ష్యం
వేములవాడరూరల్: ఆయనకు చూపు లేదు. పట్టుదల.. కఠోరదీక్ష ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు వేములవాడరూరల్ ఎంపీడీవో కవికోట శ్రీనివాస్. అంధుడు కావడంతో బ్రెయిలీ లిపిలో విద్యాభ్యాసం చేశారు. పట్టుదలతో చదివి గ్రూప్–4 జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం వేములవాడరూరల్ ఎంపీడీవోగా విధులు నిర్వరిస్తున్నారు. ఆయన జీవితం.. ఉద్యోగ విధులపై ప్రత్యేక కథనం.
అంధుల స్కూల్‌లో విద్యాభ్యాసం
కరీంనగర్ పట్టణానికి చెందిన కవికోట నర్సింహాచారి–భాగ్యలక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు. శ్రీనివాస్ తండ్రి వెటర్నరీ లైవ్‌స్టాక్ అసిస్టెంట్‌గా పని చేయగా తల్లి గృహిణి. పెద్దకొడుకు శ్రీనివాస్ కరీంనగర్‌లోని అంధుల ఆశ్రమ పాఠశాలలో బ్రెయిలీ లిపీలో 10వ తరగతి పూర్తి చేశాడు. ఇంటర్ కరీంనగర్‌లో పూర్తి చేసిన ఆయన అంధుడు కావడంతో అధ్యాపకులు చెప్పిన పాఠాలను ఆ రోజుల్లో టేప్‌రికార్డుల్లో నమోదు చేసి చెల్లెలు ధనలక్ష్మి సహకారంతో నోట్స్ రాసుకునేవారు. 1997లో ప్రభుత్వ శారీరక వికలాంగులకు గ్రూప్–4 పరీక్ష నిర్వహించగా ఉత్తీర్ణత సాధించాడు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోగా.. 1997 డిసెంబర్ 30న ఉద్యోగం కరీంనగర్ జిల్లా పరిధిలోని మహదేవ్‌పూర్ మండలం సూరారం జెడ్పీ హైస్కూల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. కొద్దిరోజుల తరువాత సిద్దిపేట జిల్లాకు చెందిన కళావతితో వివాహమైంది. వీరికి కుమారుడు మణిదీప్, కూతురు శివదీపిక ఉన్నారు. అనంతరం కరీంనగర్ పరిధిలోని బోయినపల్లి, తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండీ జెడ్పీహెచ్‌ఎస్‌లో పనిచేశారు. అదే సమయంలో అంధ ఉద్యోగుల సంఘం ఎంప్లాయీస్ యూనియన్‌గా తన సేవలను అందించారు. 2013లో సీనియర్ సహాయకుడిగా పదోన్నతిపై కాల్వశ్రీరాంపూర్ ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. 2017లో సూపరింటెండెంట్‌గా మంథని ఎంపీడీవో కార్యాలయానికి పదోన్నతిపై వెళ్లారు. 2019 డిసెంబర్ 4న సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండల ప్రజాపరిషత్‌లో పదోన్నతిపై ఎంపీడీవోగా చేరారు. 2020లో అక్కడి నుంచి ముత్తారం ఎంపీడీవోగా బదిలీపై వెళ్లారు. 2024 ఫిబ్రవరి 12న వేములవాడరూరల్ ఎంపీడీవో కార్యాలయానికి బదిలీపై వచ్చి ప్రస్తుతం కొనసాగుతున్నారు. రెండేళ్లుగా ఇక్కడ 17 గ్రామాలకు ఎంపీడీవోగా కొనసాగుతూ ప్రతిరోజు విధుల్లో భాగంగా రోజుకు రెండు నుంచి మూడు గ్రామాలు తోటి ఉద్యోగుల సహాయంతో వెళ్తుంటారు. ప్రతీ గ్రామంలో జరిగే సమావేశాలకు, అభివృద్ధి పనులకు వెళ్లి పనుల పర్యవేక్షణ, ప్రజలకు పలు సూచనలు అందిస్తారు.
విధి నిర్వహణలో సాంకేతికత
చూపు లేకపోయినా ఇబ్బంది పడకుండా తనకున్న సాంకేతికతతో అన్ని పనులను పర్యవేక్షిస్తారు. మొబైల్‌ఫోన్‌లో ఉంటే టాక్ బ్యాక్ అనే అప్లికేషన్ ఆధారంగా సెల్‌ఫోన్‌లోని ఫైల్స్, ఫోన్‌బుక్‌లోని పేర్లు చదవడానికి వాడుకుంటారు.
తెలంగాణ అంధుల అధ్యక్షుడిగా..
తెలంగాణ అంధుల అధ్యక్షుడిగా తోటి అంధులకు ధైర్యం కల్పిస్తూ ఎన్నో విషయాలు చెబుతుంటారు. ఆ సంఘానికి రెండు దఫాలు వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం తెలంగాణ అంధుల అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అంధులకు చేరేలా ఎన్నో విషయాలు వారికి చెబుతూ సహాయ సహకారాలు అందిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పర్యటనలు.. పనుల పరిశీలన
చూపు లేదు.. మనోనేత్రంతో చూస్తాడు
కళ్లు లేకున్నా క్షేత్రస్థాయి పర్యటనలు
వేములవాడ రూరల్ ఎంపీడీవో శ్రీనివాస్ జీవనశైలి
ఎంపీడీవోగా విధులు ని ర్వహిస్తూ గ్రామాలు పర్యటిస్తున్న సందర్భంలో చాలా మంది నిరుపేదలు కుటుంబ పరిస్థితులు నాకు వివరిస్తారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు నిరుపేదలకు చేరడమే నా లక్ష్యం. అప్పుడే నాకు నిజమైన సంతృప్తినిస్తుంది. ఉద్యోగంలో ఏ రోజు కూడా అంధుడని బాధపడలేదని, ఎక్కడ విధులు నిర్వహించినా అధికారులు, తోటి ఉద్యోగులు తనకు తోడుగా నిలిచి ఎంతో తోడ్పాటు అందిచారు. – కవికోట శ్రీనివాస్,
ఎంపీడీవో, వేములవాడరూరల్


