హుజూరాబాద్: హుజూరాబాద్‌లోని మామిండ్లవాడకు చెందిన చింత సునీత(35) అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. సహజీవనం చేసిన వ్యక్తే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసి, సోమవారం హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి వివరాలు వెల్లడించారు. హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చింత సునీత భర్త ఐదేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి హుజూరా బాద్ పట్టణంలోని మామిండ్లవాడలో నివాసం ఉంటోంది. కొన్నేళ్లుగా జమ్మికుంటరోడ్డులోని మోతె కిరణ్‌తో సహజీవనం చేస్తోంది. సునీత పక్కింట్లో ఉండే ముతోజు భాగ్యతో స్నేహంగా ఉంతోంది. తరచూ వీరిద్దరూ కలిసి తిరుగుతుండటంతో సునీత వ్యభిచారం చేస్తోందని కిరణ్ అనుమానం పెంచుకున్నాడు. ఇద్దరూ తరచూ గొడవ పడేవారు. ఈ నెల 10న కిరణ్, సునీత కలిసి మద్యం తాగారు. మళ్లీ గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన కిరణ్ సునీత గొంతు నులిమాడు. చీరతో గొంతు బిగించాడు. కాలితో మెడపై తొక్కి హత్య చేశాడు. మృతదేహాన్ని ముతోజు భాగ్య ఇంటి సమీపంలోని బావిలో పడేశాడు. అక్కడి నుంచి కరీంనగర్ పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 13న హుజూరాబాద్‌కు వచ్చాడనే సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించాడు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, రిమాండ్ చేశారని ఏసీపీ వెల్లడించారు.
సహజీవనమే ప్రాణం తీసింది
వీడిన మహిళ హత్యకేసు మిస్టరీ
వివరాలు వెల్లడించిన ఏసీపీ మాధవి


