కదపరే! | - | Sakshi
Sakshi News home page

కదపరే!

Jul 14 2026 12:06 AM | Updated on Jul 14 2026 12:06 AM

హోంగార్డు బదిలీల వివరాలు

ప్రాధాన్య క్రమంలో అవుతున్నాయి

రెండు వారాల క్రితం హోంగార్డుల బదిలీ

ఇప్పటికీ అందని రిలీవ్‌ ఉత్తర్వులు

ఉమ్మడి కరీంనగర్‌ పరిధిలోని ఏడు జిల్లాల్లో ప్రభావం

ట్రాన్స్‌ఫర్‌ ఆపేందుకు ఆర్‌ఐలు డబ్బులు డిమాండ్‌?

హోంగార్డుల వాట్సాప్‌ గ్రూపుల్లో విమర్శల హోరు

ప్రాధాన్య క్రమంలో బదిలీలు అవుతున్నాయన్న సీపీ

బదిలీ అయినా

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

మ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో జరిగిన హోంగార్డుల బదిలీలు మరోసారి విమర్శల పాలవుతున్నాయి. గతేడాది మేలో జరిగిన బదిలీలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో ఈసారి పూర్తి పారదర్శకంగా నిర్వహించామని చెబుతున్నా.. ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. బదిలీలు జరిగి రెండు వారాలు గడిచినా ఇంతవరకు వారికి రిలీవ్‌ ఆర్డర్స్‌ రాకపోవడంపై డిపార్ట్‌మెంట్‌లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ బదిలీలపై హోంగార్డులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. బదిలీ అయిన మెజారిటీ హోంగార్డుల్లో నేటికీ రిలీవ్‌ ఆర్డర్స్‌ రాలేదు. రాజకీయంగా, అధికారుల పరంగా పరపతి ఉన్న హోంగార్డులు ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్‌కు వచ్చి విధుల్లో చేరడంతో ఈ విమర్శల జోరు మరింత పెరిగింది. హోంగార్డుల వాట్సాప్‌ గ్రూపుల్లో బదిలీపర్వాన్ని పరస్పర విమర్శలతో హోరెత్తిస్తున్నారు.

అసలేం జరిగింది..?

2016లో జిల్లాల పునర్విభజన జరిగింది. ఉమ్మడి జిల్లా సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాలుగా విడిపోయాయి. కొన్ని మండలాలు జయశంకర్‌భూపాలపల్లి, సిద్దిపేట, హన్మకొండలో విలీనమయ్యాయి. ఆయా మండలాల్లో విధులు నిర్వహించే హోంగార్డులందరికీ ఇప్పటికీ కరీంనగర్‌ యూనిట్‌ కేంద్రం. వారి బదిలీలు నేటికీ ఇక్కడి నుంచే అవుతాయి. 2016 తరువాత తొమ్మిదేళ్లకు (2025మే) హోంగార్డుల బదిలీలు అయ్యాయి. ఆ సమయంలో నిబంధనలు పాటించలేదని ఉన్నతాధికారులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈసారి అలాంటి విమర్శలేవీ రాకుండా సీపీ గౌస్‌ఆలం అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పూర్తి పారదర్శకంగా డ్రా విధానంలో 373 మంది హోంగార్డుల బదిలీ ప్రక్రియ చేపట్టారు. (నిబంధనల ప్రకారం ప్రత్యేక మినహాయింపులు పొందిన వితంతు మహిళలు, తీవ్ర అనారోగ్య బాధితులు, మానసిక వికలాంగ పిల్లలు ఉన్నవారు, జూన్‌ 2027 లోపు ఉద్యోగ విరమణ చేయనున్న వారిని మినహాయించారు) రిలీవ్‌ ఆర్డర్స్‌ రావడంలో జాప్యం.. బదిలీ ప్రక్రియపై హోంగార్డుల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది.

రాలేమని కొందరు.. వస్తమని కొందరు

బదిలీపై హోంగార్డులు పెదవి విరుస్తున్నారు. బదిలీ అయిన ఏడాది కాకముందే చిన్న ఉద్యోగులమైన తమపై బదిలీ వేటు వేస్తే ఎలా అని అంటున్నారు. పిల్లల స్కూలు ఫీజు చెల్లించామని, ఇపుడు బదిలీ అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రిలీవ్‌ ఆర్డర్స్‌ కూడా ఆలస్యం అవుతుండటంతో బదిలీల ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. చాలామంది హోంగార్డులు విధుల్లో చేరేందుకు సుముఖంగా లేరు. మరికొందరు తాము ఉన్న చోటు నుంచి కదలబోమంటూ పైరవీలు ప్రారంభించారు. రాజకీయ పలుకుబడి ఉన్నవారు రిలీవ్‌ ఆర్డర్స్‌ తెచ్చుకున్నారని, లేనివారు అక్కడే ఉండిపోయారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బదిలీ ప్రక్రియను ప్రభావితం చేస్తామని కొందరు ఆర్‌ఐలు డబ్బులు అడుగుతున్నారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

రిలీవ్‌ ఆర్డర్స్‌ అందడంలో కొంత జాప్యం ఉన్నమాట వాస్తవమే. ప్రాధాన్యక్రమంలో అందరినీ రిలీవ్‌ చేస్తున్నాం. ఇందుకోసం ఏడు యూనిట్లతో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాయి. కొందరు బదిలీ ఇష్టం లేని హోంగార్డులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బదిలీలను అత్యంత పారదర్శకంగా చేశాం. కుటుంబ, వ్యక్తిగత సమస్యలకు ముందే మినహాయింపు ఇచ్చాం. బదిలీని ప్రభావితం చేస్తామని ఎవరు చెప్పినా నమ్మవద్దు. బదిలీల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా నాకు ఫిర్యాదు చేయవచ్చు.

– గౌస్‌ ఆలం, కరీంనగర్‌ సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement