● నాన్నకు అన్నం పెట్టివస్తా.. అంటూ వెళ్లి ● ఇంట్లో ఉరివేసుకున్న యువకుడు
కరీంనగర్ క్రైం: తెల్లవారితే పెళ్లి. బంధుమిత్రుల సందడి. వేడుకల హడావుడి. మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు. అంతలోనే విషాదం. తండ్రికి భోజనం పెట్టి వస్తానంటూ ఫంక్షన్‌హాల్ నుంచి వెళ్లిన పెళ్లికొడుకు తిరిగి రాలేదు. వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబసభ్యులకు విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటన కరీంనగర్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. నగరంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన మహ్మద్ అబ్దుల్ రావూఫ్(28) హైదరాబాద్‌లో ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల కుటుంబసభ్యులు వివాహం నిశ్చయించారు. జూలై 10న వివాహం జరిపేందుకు నిర్ణయించారు. జూలై 9న కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో వివాహ కార్యక్రమం జరుగుతోంది. రాత్రి సుమారు 9గంటలకకు రావూఫ్ కూడా కుటుంబ సభ్యులతో అక్కడే ఉన్నాడు. పక్షవాతంతో మంచానికే పరిమితమైన తన తండ్రి ఇంటివద్ద ఉన్నాడని, ‘నాన్నకు భోజనం పెట్టి వస్తా’ అంటూ ఇంటికి వెళ్లాడు. రెండు గంటలు గడిచినా తిరిగి రాకపోవడంతో బంధువులు ఇంటికి వెళ్లారు. రావూఫ్ ఉరికి వేలాడుతూ కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని టూటౌన్ సీఐ సృజన్‌రెడ్డి తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు.
రూ.3.20లక్షలకు బెల్ట్‌షాపు వేలం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో మద్యం బెల్ట్‌షాపు నిర్వహణకు శనివారం గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో బహిరంగ వేలంపాట నిర్వహించారు. పోటాపోటీగా సాగిన వేలంపాటలో రూ.3.20 లక్షలకు ఒకరు దక్కించుకున్నారు. ఈ డబ్బులు చెల్లించి రెండేళ్లపాటు గ్రామంలో బెల్టుషాపు నిర్వహంచుకోవచ్చని గ్రామస్తులు నిర్ణయించారు. వేలంపాటలో బెల్ట్‌షాపు దక్కించుకున్న వ్యక్తి కాకుండా ఇతరులు గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.25వేలు జరిమానా విధిస్తామని, సమాచారం ఇచ్చిన వారికి రూ.5వేలు పారితోషికం అందజేస్తామని తీర్మానించారు.


