గొల్లపల్లి: ఆ ఇంటిని తొమ్మిది నెలల క్రితం విధి వెక్కిరించింది. ఆర్థిక ఇబ్బందుల సుడిగుండంలో చిక్కుకున్న కుటుంబ పెద్ద గడ్డిమందు తాగి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. రెక్కలు తెగిన పక్షిలా మారినప్పటికీ ముగ్గురు పిల్లలను గుండెకు హత్తుకుని కన్నీళ్లను దిగమింగుతూ ఆ తల్లి కూలీ పనిచేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తోంది. ఒంటరితనం, అప్పులభారం, పిల్లల భవిష్యత్‌పై ఆందోళన ఆమెను కుదురుగా ఉండనీయలేదు. మనోవేధనకు గురైన ఆ తల్లి చివరకు ముగ్గురు బిడ్డలను నడిరోడ్డుపై వదిలేసి తనువు చాలించింది. ఈ ఘటన గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో శనివారం విషాదం నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. రాపల్లికి చెందిన కళ్లపల్లి హరీశ్, గౌతమి దంపతులకు వర్షిత (13), రోహన్ (11), రోహిత్ (7) సంతానం. వీరు స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నారు. భార్యాభర్తలిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. హరీశ్ ఆర్థిక ఇబ్బందులతో గడ్డి మందు తాగి తొమ్మిది నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుంచి ముగ్గురు చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న గౌతమి తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. ఆర్థిక కష్టాలు తీర్చే దారి లేక జీవితంపై విరక్తితో ఇంట్లోనే ఉరేసుకుంది.
అనాథలైన పిల్లలు
నాడు తండ్రి చనిపోయినా.. ఆయన లేని లోటును భర్తీ చేసిన తల్లి కూడా మృతిచెందడంతో ఆ పసిపిల్లలు శవం ముందు ఏడుస్తుంటే కళ్లు చెమర్చుతున్నాయి. అమ్మా లే.. ఆకలేస్తుందంటూ రోదించిన తీరు గ్రామాన్ని కన్నీటిసంద్రంలో ముంచేసింది. అనాథలైన ముగ్గురుపిల్లల భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ చిన్నారులను ఆదుకునేందుకు మానవతావాదులు ముందుకు రావాలని గ్రామస్తులు కోరుతున్నారు.


