గడువులోగా పూర్తి చేస్తాం
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ నగరంలో గడువులోగా వందశాతం పూర్తి కావడం గగనంగానే కనిపిస్తోంది. ఈ నెల 24వ తేదీలోగా వందశాతం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి కావాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయగా ఇప్పటివరకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 18 శాతం ఆన్‌లైన్ పూర్తయింది. మరో 12 రోజుల్లో 82 శాతం ప్రక్రియను పూర్తి చేయాలంటే కష్టపడాల్సిన పరిస్థితి.
18 శాతమే ఆన్‌లైన్
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 390 పోలింగ్ బూత్‌లు ఉండగా, నగరపాలకసంస్థ పరిధిలో దాదాపు 315 వరకు ఉన్నాయి. ఓటరుకు ఎన్యుమరేషన్ ఫామ్‌లు ఇచ్చి, తిరిగి తీసుకొనే ప్రక్రియను గత నెల 25వ తేదీన చేపట్టగా, ఈ నెల 24వ తేదీతో ముగియనుంది. బీఎల్‌వోలు సంబంధిత బూత్‌ల పరిధిలో ఉన్న ఇళ్లకు వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫామ్ అందించారు. పూరించి తిరిగి ఇచ్చిన ఫాంలను ఆన్‌లైన్ చేస్తున్నారు. కొంతమంది నేరుగా ఆన్‌లైన్ చేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 18 శాతం మాత్రమే ఎన్యుమరేషన్ ఫామ్‌ల ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 24వ తేదీలోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మరోసారి హెచ్చరించింది. దీనితో 12 రోజుల వ్యవధిలో 82 శాతం పూర్తి చేయడం అధికారులకు పెను సవాల్‌గా మారింది.
ఫారాలు అందలే...
ఎన్యుమరేషన్ ఫామ్‌ల పంపిణీ వందశాతం పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. చాలా డివిజన్లలో ఇప్పటివరకు ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫామ్‌లు అందలేదు. ఆయా ఓటర్లు స్థానికంగా లేకపోవడం, ఇతర పాత్రాలకు అద్దెకు వెళ్లడం, ఫోన్‌నంబర్లు మారడం, ఫోన్‌లలో దొరకకపోవడం తదితర కారణాలతో ఫామ్‌లు ఇవ్వలేకపోయారు. అంతేకాకుండా కొంతమంది ఓటర్లకు సంబంధించి ముద్రించిన ఫామ్‌లు కూడా సంబంధిత బీఎల్‌ఓలకు రాకపోవడం మరో కారణం. దీంతో ప్రక్రియకు గడువు సమీపిస్తున్నప్పటికీ ఫామ్ ఇవ్వలేదని బీఎల్‌వోలకు ఫోన్‌లు వస్తూనే ఉన్నాయి.
ఫామ్ నింపడమే సమస్య
సర్ ప్రక్రియలో ఓటరుకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫామ్ నింపడమే ప్రధాన సమస్యగా మారింది. బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఓటరు పేరిట ఉన్న ఫామ్‌ను అందిస్తున్నారు. ఓటరు ఆ ఫామ్‌ను పూర్తి చేసి తిరిగి బీఎల్‌ఓకు అందచేస్తే ఆన్‌లైన్ చేస్తారు. చాలా మంది ఫామ్‌లను పూరించే బాధ్యత బీఎల్‌వోలకు అప్పగిస్తున్నారు. తామే ఫామ్ నింపితే ఎక్కడ తప్పు పోతుందో, ఓటుంటుందో పోతుందో అనే ఆందోళనతో ఎక్కువగా ఓటర్లు బీఎల్‌ఓల వైపే మొగ్గుచూపుతున్నారు. మరికొంతమంది బీఎల్‌ఓలకు కూడా ఫామ్‌లు నింపడం, ఆన్‌లైన్ చేయడం సక్రమంగా రాకపోవడంతో పని ఒత్తిడి పెరిగిపోతోంది.
సర్ ప్రక్రియ వేగం పెంచేందుకు ప్రతి బీఎల్‌వోకు నగరపాలకసంస్థ నుంచి సపోర్టింగ్ స్టాఫ్‌ను ఇచ్చాం. సూపర్‌వైజర్లు, మానిటరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. బీఎల్‌ఓలకు ఆన్‌లైన్ ఆపరేటర్‌లను కూడా ఇచ్చాం. దీనితో ఆన్‌లైన్ ప్రక్రియ వేగం అందుకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గడువులోగా పూర్తి చేస్తామనే విశ్వాసం ఉంది.
– ప్రఫుల్ దేశాయ్, ఈఆర్‌వో,
నగరపాలకసంస్థ కమిషనర్


