కరీంనగర్‌టౌన్: విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. శుక్రవారం వామపక్ష విద్యార్థి సంఘాల అధ్వర్యంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ పాటించారు. తెలంగాణ చౌక్ నుంచి బైక్ ర్యాలీగా ప్రభుత్వ విద్యాసంస్థలను బంద్ చేయించేందుకు వెళ్తున్న ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌బీ, ఏఐఎఫ్‌డీఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పీటీసీకి తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించాలన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజు భారాన్ని తగ్గించాలన్నారు. ఎన్‌ఈపీ–2020ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి రాణాప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.


